శ్రీవారి దర్శనానికి రోజుకు లక్ష మంది వచ్చినా సింపుల్గా ప్రక్రియ జరిగిపోయేది. దర్శనం.. లఘు దర్శనం, మహా లఘు దర్శనం అని పెట్టినా భక్తులు సర్దుకుపోయేవారు. క్యూలైన్లు ఇరవై నాలుగు గంటల పాటు సాగినా ఎప్పుడూ తొక్కిసలాంటివి చోటు చేసుకున్నాయని వార్తలు కనిపించేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓ పద్దతి లేదు… వ్యవస్థ లేదు. సమాధానం చెప్పే వారు లేరు. కానీ వెల్లువలా భక్తులు వచ్చారు. వారిని నియంత్రించలేక టీటీడీ చేతులెల్తేసింది. ఫలితంగా కొండ మీదకు వెళ్లి దేవదేవుడ్నిదర్శించుకుని గోవిందా.. గోవింద అను స్మరించాల్సిన జనం కొండ కిందనే ప్రభుత్వంపై, సీఎంపై విరుచుకుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీవారి దర్శనార్థం నాలుగు రోజుల నుంచి భక్తులు ఎక్కువగా ఉన్నారు. సర్వదర్శనం ప్రారంభించినందున తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కానీ వచ్చే వారిని అంచనా వేయకుండా టోకెన్లు పరిమితంగా జారీ చేస్తూ.. వారందర్నీ అక్కడే నిరీక్షించేలా చేశారు. ఫలితంగా భక్తులు అక్కడే పోగుపడిపోయారు. చివరికి దర్శనం టిక్కెట్లు అందని పరిస్థితి. టిక్కెట్ల కోసం తోపులాట జరిగింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ తీరుచూసి భ క్తులకు మండిపోయింది. ఇదేం వ్యవస్థ అని విమర్శించకుండా ఒక్కరూ ఉండలేకపోయారు.
టీటీటీ తీరు గత మూడేళ్లుగా వివాదాస్పదమవుతూనే ఉంది. ప్రతి సేవకూ ధరలు పెంచడంపై శ్రద్ధ చూపుతున్నారు. డబ్బులు కట్టే భక్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నిజంగా భక్తి భావంతో వచ్చే సామాన్య భక్తులపై మాత్రం ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. కరోనా పేరుతో ఇంత కాలం వారికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. అత్యధిక మంది భక్తులు దర్శనం సాధ్యం కాదని తిరిగి వెళ్లిపోయారు. శ్రీవారి దర్శనానికితిరుపతి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్లేవాళ్లు బహుశా ఇప్పుడే ఉంటారేమో ?
ఎలా చూసినా టీటీడీ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. అక్కడకు వచ్చిన భక్తులందరూ… ఏపీ ప్రభుత్వాన్నే నిందించారు. ప్రభుత్వం కూడా సరైన వ్యవస్థను ఉంచకపోతే ఎంత చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుందో..,. తిరుమల దర్శన తొక్కిసలాట ఘటన తర్వాత తెలుసుకుని ఉంటుంది.