Beast Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
హీరోయిజం.. కొత్త రూట్లోకి వెళ్తోంది. వందమందిని ఒక్కడే కొట్టేయడం, చొక్కా నలగకుండా చంపేయడం.. మాత్రమే హీరోయిజం అనే భ్రమల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే… కొంతమంది మాత్రం ఇంకా ఆ స్థాయిలోనే ఆలోచిస్తూ కథలు అల్లుకుంటున్నారు. ఓ స్టార్ హీరో దొరగ్గానే – `సినిమా ఇలానే తీయాలేమో` అనుకుని… కొత్త దారుల్లో వెళ్లడం రిస్కేమో అని భయపడి… రొటీన్ బాటే పడుతున్నారు. అందుకే… నెట్ ఫ్లిక్స్ల కాలంలోనూ, రొటీన్ కమర్షియల్ సినిమాలు, ఫక్తు హీరోయిజం చూడాల్సివస్తోంది. అందుకు బీస్ట్ మరో ఉదాహరణ.
`వరుణ్ డాక్టర్` సినిమా చూసిన ఎవరెనా సరే, ఆశ్చర్యపోతారు. దర్శకుడి కామెడీ టైమింగ్ కి ఫిదా అయిపోతారు. ఓ రొటీన్ స్టోరీని, చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా నడిపిన విధానం నచ్చేస్తుంది. అందుకే విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అక్కడ నెలన్స్ ఎలా ఆలోచించాలి? `వరుణ్ డాక్టర్`కంటే మేలైన ప్రొడెక్ట్ అందించాలి. కానీ.. నెల్సన్ మాత్రం `విజయ్ హీరోయిజం` ట్రాపులో అతుక్కుపోయాడు. ఇది వరకు విజయ్‌ని మిగిలిన దర్శకులు ఎలా చూపించారో, ఇది వరకు విజయ్‌ని అభిమానులు ఎలా చూశారో.. అలాంటి సినిమానే అందించాడు. అదే.. బీస్ట్.
వీర రాఘవ (విజయ్) ఓ `రా` ఏజెంట్. కశ్మీర్లో జరిపిన ఓ ఆపరేషన్‌లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉమర్ ఫరుక్‌ని పట్టుకుంటాడు. అయితే.. ఆ మిషన్ లో చిన్న పాప చనిపోతుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ పాప చనిపోవడానికి కారణం తనే అనేది … వీర గిల్టీ ఫీలింగ్. అందుకే… ఉద్యోగాన్ని వదిలేసి దూరంగా బతుకుతాడు. అయితే.. పదకొండు నెలల తరవాత ఉమర్ ఫారుక్‌ని విడిపించుకోవడానికి ఉగ్రవాదులు ఓ కుట్ర పన్నుతారు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి.. అందులో ఉన్న ప్రజల్ని బంధీలుగా పట్టుకుని, ప్రభుత్వాన్ని బెదిరించి… ఉమర్ ఫారుక్‌ని విడిపించుకోవాలన్నది ప్లాన్. అయితే టెర్రరిస్టులు షాపింగ్ మాల్ ని హైజాగ్ చేసినప్పుడు అక్కడే వీర కూడా ఉంటాడు. ఆ టెర్రరిస్టుల నుంచి… ప్రజల్ని వీర ఎలా కాపాడాడు? ఉమర్ ఫారుక్ పాకిస్థాన్ పారిపోకుండా ఎలా అడ్డుకున్నాడు? అనేదే కథ.
పాయింట్ పరంగా చూస్తే… బాగానే ఉంది. ఓ `రా` ఆఫీసర్.. తాను పట్టుకున్న టెర్రరిస్టుని, మళ్లీ తానే ఎలా అడ్డుకున్నాడు? అనేది రొటీన్ పాయింటే అయినా, ఓ షాపింగ్ మాల్ని హైజాగ్ చేయడం, అక్కడే హీరో ఉండడం, తాను రంగంలోకి దిగి… మిషన్ పూర్తి చేయడం, పక్కా కమర్షియల్ సినిమాకి పనికొచ్చే లైన్. కథలో ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా కిక్ ఇచ్చేదే. టెర్రరిస్ట్ లానే.. హీరో కూడా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం… నిజంగా థ్రిల్లింగ్ పాయింట్. కాకపోతే.. దానికి ముందూ… ఆ తరవాత… కథ, కథనాలు పూర్తిగా అదుపు తప్పి ప్రవర్తిస్తుంటాయి. కేవలం విజయ్‌ని నమ్ముకుని దర్శకుడు గుడ్డిగా కొన్ని సీన్లు తీసేశాడు. కేవలం హీరోయిజాన్ని బేస్ చేసుకుని, లాజిక్కులు వదిలేసి సీన్లు అల్లుకుంటూ వెళ్లిపోయాడు. విజయ్ ని పిచ్చ పిచ్చగా ఇష్టపడే ఫ్యాన్స్‌కి అవన్నీ నచ్చేయొచ్చు. కానీ సగటు ఆడియన్స్‌కి మాత్రం అదంతా టార్చర్ లా అనిపిస్తుంది.
ఓ `రా` ఆఫీసర్… సగటు సెక్యురీటీ కంపెనీలో జీతానికి దిగడం ఏమిటి? అది కూడా ఓ అమ్మాయి కోసం. పూజా హెగ్డే లవ్ ట్రాక్ అన్ కన్వెన్సింగ్గా ఉంది. హైజాగ్ చేసే సమయానికి హీరో ఆ షాపింగ్ మాల్ లో ఉండడానికి తప్ప, ఆ ట్రాక్‌కీ, హీరోకుండే స్టేటస్ కీ అస్సలు లింకే కుదరలేదు. అంతమంది ఉగ్రవాదుల్ని.. హీరో ఒంటి చేత్తో మట్టుబెట్టడం… మరీ నేల విడిచి సాము చేసినట్టు అనిపిస్తుంది. హోస్టేజీల వైపు నుంచి చూస్తే.. వాళ్లపై ప్రేక్షకులకు ఎలాంటి సానుభూతి ఉండదు. వాళ్లంతా స్కూలు పిల్లల్లా వరుసగా కూర్చోవడం తప్ప ఏం చేయరు. పైగా హీరో.. వేసే ప్రతీ ఎత్తుకీ చిత్తయిపోతుంటాడు టెర్రరిస్టు నాయకుడు. టెర్రరిస్టులు అసలు వాళ్లదగ్గర ప్లానే లేనట్టు బ్లాంక్ ఫేస్ పెట్టుకుని చూస్తుంటారు, లేదంటే… హీరో చేతిలో చచ్చిపోతుంటారు. బలమైన వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులూ లేకపోతే… ఆటలో మజా ఏముంటుంది?
`మనీ హీస్ట్` చూశారా? నెట్ ఫ్లిక్స్‌లోని సూపర్ డూపర్ వెబ్ సిరీస్. దాని స్ఫూర్తితోనే.. బీస్ట్ కూడా రాసుకుని ఉంటాడు. కొన్ని చోట్ల… మనీ హీస్ట్ రిఫరెన్సులు కనిపిస్తాయి. కానీ.. `మనీ హీస్ట్`లో ఉండే మ్యాజిక్, ఆ తెలివి తేటలూ.. ఈ సినిమాలో ఉండవు. `వరుణ్ డాక్టర్`లో ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాలోనూ అక్కడక్కడ నెల్సన్ మార్కు కనిపిస్తుంది. ముఖ్యంగా పూజా హెగ్డే బాస్ చేసే కామెడీ, సైలెంట్ పంచ్‌లూ నవ్వు తెప్పిస్తాయి. కానీ ఆ జోష్ సరిపోలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోయింది. అక్కడైనా.. హీరోకి సవాల్ విసిరే సందర్భం వస్తుందనుకుంటే రాదు. పాకిస్థాన్ వెళ్లి టెర్రరిస్టుని ఎత్తుకురావడం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఈ సినిమా రన్ టైమ్ ఎక్కువ. అది చాలదన్నట్టు సినిమా అయిపోయిన తరవాత కూడా ఓ పాట పెట్టారు.
విజయ్ ఎప్పట్లా స్టైలీష్ యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. చొక్కా నలగకుండా, జుత్తు చెదరకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఫైట్లు చేశాడు. డాన్సులు మాత్రం సూపర్. అరబిక్ సాంగ్ లో విజయ్ స్టెప్పులు చూసి తరించాల్సిందే. పూజాకి స్కోప్ చాలా తక్కువ. సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా, తనపై రాసుకున్న డైలాగులు వర్కవుట్ అయ్యాయి. కథలో ప్రతినాయకుడు దాదాపు సగం సినిమా మాస్క్ తోనే కనిపిస్తాడు. మిగిలిన సగం మాస్క్ తీసేసినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో బీజియమ్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అరబిక్ పాట ఇప్పటికే హిట్. థియేటర్లో విజయ్ స్టెప్పులతో కలిపి చూస్తే ఇంకా బాగుంది. దర్శకుడి ఐడియా బాగుంది గానీ, అది సరిగా ఎలివేట్ అవ్వలేదు. బలమైన విలన్ లేకపోవడం, హీరో కి ఎదురే లేకుండా సీన్లు రాసుకోవడం వల్ల… చూసిన సీనే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎంత పెద్ద మాస్ హీరో దొరికినా సరే, దర్శకుడు తన స్టామినాని, బలాన్ని మర్చిపోకూడదు.. అని చెప్పడానికి బీస్ట్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2/5