దర్శకుడు మారుతి రిలీజ్ చేసిన ‘1996 ధర్మపురి’’ ట్రైలర్ ఆసక్తికరంగా వుంది. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకు తగినట్లు సహజసిద్ధ వాతావరణంలో వాస్తవానికి దగ్గర చిత్రీకరించిన ఈ ప్రేమ కథ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. యువ నటులు గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ తెరకెక్కించిన చిత్రమిది. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్రానికి సమర్పకులుగా వుండటం మరో విశేషం.
ట్రైలర్ విషయానికి వస్తే.. యదార్థ ప్రేమకథని వాస్తవానికి దగ్గర చూపించినట్లనిపిస్తుంది. విజువల్స్, ప్రేమకథ నేపధ్యం సహజంగా వున్నాయి. డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ధర్మపురిలో ఉండే దొర గడిలో పనిచేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథగా సినిమా సాగుతుందని యూనిట్ చెబుతుంది. హీరో పాత్ర వేసిన గగన్ చాలా సహజంగా కనిపించాడు. అతని కళ్ళల్లో ఎక్స్ ప్రేషన్స్ బాగా పలుకుతున్నాయి. ఇక ట్రైలర్ లో హీరోయిన్ కొడవలి పట్టుకు వచ్చే సీన్ రంగస్థలంలో రామ్ చరణ్ ని గుర్తుకు తెచ్చింది. ప్రేమ కథలని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ధర్మపురి ట్రైలర్ కథలో కంటెంట్ వుందనే భరోసా ఇస్తుంది. ఏప్రిల్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.