వైసీపీలో అసంతృప్తి చల్లారిపోయింది. స్థాయికి తగ్గ నేతలు వారిని బుజ్జగించారు. సీఎం స్థాయి తగ్గ నేతల్ని వారు బుజ్జగించారు. తమ అసంతృప్తిని హైకమాండ్ గుర్తించి కనీసం భవిష్యత్లో చాన్సిస్తామని హామీ ఇస్తే చాలని ఎక్కువ మంది అనుకున్నారు. అంతే కానీ వారు రాజీనామా అనే ఆలోచన చేయలేదు. మీడియా లో ప్రచారం జరిగినా.. అనుచరులను రోడ్డెక్కించి అవే మాటలు వినిపించినా.. వారు అలాంటి ఆలోచన అసలు చేయలేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వైసీపీ నేతలకు వైసీపీ తప్ప మరో ఆప్షన్ లేదు. ఇతర పార్టీల్లో వారు చేరే పరిస్థితి లేదు. చేర్చుకునేందుకు కూడా ఇతర పార్టీలు ఆలోచించాల్సిన పరిస్థితి.
వైసీపీ అగ్రనాయకత్వం తమ నేతలతో వ్యక్తిగత శత్రుత్వ స్థాయి రాజకీయాలు చేయించింది. రాజకీయాలను ఉద్రిక్తంగానే ఉంచింది. ఎవరికైనా ప్రత్యామ్నాయం లేకుండా చేయడంలో దాదాపుగా సక్సెస్ అయింది. మంత్రులయినా.. మాజీ మంత్రులయినా.. పదవి ఆశించి భంగపడిన వారయినా ఇతర పార్టీలను అత్యంత దారుణంగా తులనాడిన వారే. వారినిపార్టీలో చేర్చుకునేందుకు ఇతర పార్టీలు సిద్ధపడవు. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు చేర్చుకోరు. ఈ విషయం వైసీపీ నేతలకూ తెలుసు. జంపింగ్ అనేది సాధ్యం కాదని ఏమి ఉన్నా లేకపోయినా వైసీపీనే తమకు దిక్కని వారి క్లారిటీ ఉంది.
ఎక్కువ మంది నేతలు తమ అధినేత మెప్పు కోసం అధికారం అండతో చాలా వరకూ విపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. ఆ ఇమేజ్ వారిని వెంటాడుతోంది. అలాంటి వారిని పార్టీ వైపు రానిచ్చే అవకాశమే ఉండదు. ఎలా చూసినా ఈ వ్యూహం జగన్ చాలా పక్కాగా అమలు చేశారని అనుకోవచ్చు. తమ నేతలు ధిక్కరించకుండా అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మరో పార్టీలో గతి లేకుండా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు.