కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే.. తాము ఇస్తామంటున్న జగన్ తీసుకోవడం లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా వరాలు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వినియోగి౦చుకోవట౦ లేని కారణంగా ఫలాలు ప్రజలకి చేరటం లేదని విశాఖలో జీవీఎల్ నరసింహారావు ప్రకటించేశారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం 12శాఖలు పనిచేస్తాయని.. రైల్వేకి అవసరమున్నప్పుడు ఇస్తామని చెప్పి రైల్వేకి చెందిన 53ఎకరాలు ప్రభుత్వం తీసుకుందని అది ఇవ్వడం లేదని జీవీ ఎల్ చెబుతున్నారు.
ఇప్పుడు రైల్వే జోన్ కోసం వ౦ద నుండి 200ఎకరాల భూమి కావాలని ఆయన లెక్క చెబుతున్నారు. 150 ఎకరాల భూమి త్వరగా గుర్తించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది మాత్రమే కాదు భూములు దేని దేనికి ఇవ్వాలో కూడా జీవీఎల్ లెక్క చెప్పారు. ఈఎస్ఐ హాస్పిటల్ కోసం .. సీజీఎహెచ్ఎస్ కోసం ల్యాండ్ ఎలాట్ మె౦ట్ విషయంలో త్వరగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు. రైల్వేజోన్‌కు వందల ఎకరాల భూమి ఎందుకో జీవీఎల్ చెప్పలేదు. ఇప్పటికి ఉన్న సౌకర్యాలతోనేజోన్ పెట్టవచ్చని నిపుణులు తేల్చారు.
త్వరలో బీజేపీలోకి విస్త్రతమైన చేరికలు ఉంటాయని జీవీఎల్ చెప్పుకొచ్చారు. వైసీపీ అసంతృప్త నేతలు చేరుతారా అంటే… బీజేపీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైన ఎవరికైనా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు. జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేస్తున్నా.. వైసీపీ నేతలు స్పందిచడం మానేసి చాలా కాలం అయింది.