తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ఆలంపూర్ నుంచి ప్రారంభిస్తారు. ఆయన పాదయాత్రకు అమిత్ షా వస్తారని.. నడ్డా జెండా ఊపుతారని ఇలా ప్రచారం చేశారు కానీ చివరికి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తప్ప ఎవరూ రావడం లేదు. తెలంగాణ బీజేపీ పార్టీ సీనియర్లు ఎవరూ ఆయన పాదయాత్రకు మనస్ఫూర్తిగా సహకారం అందించడం లేదు. వివిధ సందర్భాల్లో బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణం. ఆయనపై సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. తమ ప్రాధాన్యతను తగ్గించి కేవలం బండి సంజయ్ మాత్రమే తెర ముందు ఉండాలనుకుంటున్నారని వారు కినుకతో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏకైకా శక్తి పీఠం అయిన జోగులాంబ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహింస్తారు.అనంతరం జోగులంబ గద్వాల జిల్లా నుంచే తన పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభిస్తారు. తొలి రోజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ రానున్నారు. ఈ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ యాత్ర దాదాపు 31 రోజుల పాటు సాగనుంది. ఈ పాదయాత్ర ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కొనసాగనుంది. మొదటి విడత పాదయాత్ర ప్రారంభించిన సమయంలో ఆయనకు దాదాపు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ రెండో సారి ప్రారంభమయ్యే సరికి ఆయన వ్యతిరేకుల్ని పెంచుకున్నారు.
రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌తో ఆయనకు సరిపడటం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఆయనకు వ్యతిేరంగా కొంత మంది సీనియర్లు రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే బండి సంజయ్ తనకంటూ నలుమూలలా బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారని… సీనియర్ నేతలతో పని లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీలోనూ వన్ మ్యాన్ షో చేయాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తోంది.