ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల జీవనాన్ని భారం చేసే ప్రయత్నంలో ఉంది. గత కొద్ది రోజులుగా వారానికో అంశంలో పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సం అంటే. ఈ నెలలో ఇంకా రెండువారాలు పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే కొత్త జిల్లాల పేరుతో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, కరెంట్ చార్జీలు, ఆస్తిపన్ను మరో పదిహేను శాతం.. తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచారు. అన్నీ ప్రజలపై వందల కోట్ల భారం మోపేవే.
కరోనా దెబ్బకు ప్రభుత్వమే కాదు.. ప్రజలూ విలవిల్లాడిపోతున్నారు. వారి ఆదాయాలపై గణనీయంగా ప్రభావం పడింది. అయితే కరోనా దెబ్బ తమకే అనుకుంటోంది ప్రభుత్వం. అందుకే ఇష్టారీతిన ప్రజలను బాదేస్తోంది. వారి ఆదాయాన్ని పన్నుల రూపంలో పిండేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓ వైపు ప్రభుత్వ పన్నుల పెంపుతో ప్రజలు నిలగిపోతూంటే నిత్యాసవర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండేళ్లలో రెట్టింపు అయిన నిత్యావసరాల ధరలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభుత్వం నియంత్రించడానికి చేసిన ప్రయత్నాలేమీ లేవు.
ఓ వైపు పన్నులు.. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలతో మధ్యతరగతి ప్రజల జీవితం భారం అవుతోంది. అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ప్రజల జీవితాల్ని ఎలా బాగు చేయాలా అని ఆలోచించాల్సిన ప్రభుత్వం.. వారిని మరింత పేదవారిగా చేసి.. ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడేలా చేయాలనుకుంటోంది. ఫలితంగా ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోంది. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనల్లో మార్పు రాకపోతే.. ఏపీ ప్రజలు దేశంలోనే అత్యంత పేదవారైపోతారు