పంజాబ్ ఎన్నికల్లో విజయం తర్వాత ఆమ్ ఆద్మీ దక్షిణాదిలోనూ దృష్టి పెడుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఇంచార్జిని నియమించారు. కేజ్రీవాల్ అంబేద్కర్ జయంతి రోజున పాదయాత్రకు వస్తారని కూడా ప్రకటించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అసలు సమయం దగ్గరకు వచ్చే సరికి సైలెంట్ అయిపోయింది. తటస్థుల్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తామని ముఖ్యంగా మాజీ సివిల్ సర్వీస్ అధికారులందర్నీ చేర్చుకుంటామని ప్రచారం చేసుకున్నారు. కానీ చేరడానికి ఎవరూ రాలేదు. చివరికి అంబేద్కర్ జయంతి రోజు చేయాలనుకున్న పాదయాత్రను ఇందిరాశోభన్ నేతృత్వంలో చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పార్టీకి వెళ్లి అక్కడ్నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు ఇందిరా శోభన్. ఆమె తప్ప ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుర్తుపట్టే నెలలు ఎవరూ లేరు. ఆమెకు ఆ పార్టీ తెలంగాణ సర్చ్ కమిటీ చైర్పర్సన్ హోదా ఇచ్చింది. ఆ పేరుతోనే ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం పాదయాత్రలు చేస్తామని చెబుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నత విద్యావంతుల్లో కాస్తంత ఆదరణ లభించే అవకాశం ఉంది. అయితే నేతలు కూడా వారి నుంచి వస్తేనే ఆ ఆదరణ ఉంటుంది. మంచి ఇమేజ్‌తో రిటైరైన సివిల్ సర్వీస్ అధికారుల్ని పార్టీలో చేర్చుకుని బాధ్యతలిస్తే.. ఎంతో కొంత ఓటు బ్యాంక్ వస్తుందని భావిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా కేజ్రీవాల్ పాదయాత్రకు వచ్చినా ఎంతో ప్రయోజనం ఉండేదని.. ఆయన రాకపోవడం వల్ల ఆమ్ ఆద్మీపై సీరియస్ నెస్ తగ్గుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.