మూడేళ్ల పాటు జల వనరుల మంత్రిగా ప్రాధాన్యతా శాఖ దక్కించుకున్నా కనీసం సొంతంగా ఒక్క రివ్యూ చేయకుండా ప్రాజెక్టులన్నీ ఓ సారి చూడకుండానే పదవి పోగొట్టుకున్న అనిల్ కుమార్ ఇప్పుడు రచ్చ ప్రారంభించారు. మంత్రి పదవి పోయిన వెంటనే ఆయన చెన్నై వెళ్లిపోయారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. తర్వాతి రోజు పవన్ కల్యాణ్ ను విమర్శించడానికన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు నుంచి మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి చుక్కలు చూపిస్తామని పరోక్షంగా సవాల్ చేశారు.
తనను ప్రమాణస్వీకానికి కాకాణి పిలవలేదని… తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలా సహకరించారో.. అంతకు రెండింతలు సహకరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అనిల్ మంత్రిగా ఉన్న సయమంలో కాకాణి సహకరించేవారు కాదు. ఆయన వ్యతిరేక గ్రూపులో ఉండేవారు. సీనియర్ నేత ఆనంతో కలిసి రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు తనకు చాన్స్ వచ్చిందని అనిల్ రెడీ అయ్యారు. కాకాణికి మద్దతుగా నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలు పెట్టే వారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్లెక్సీలు తీసేయిస్తున్నారు. అంతే కాదు కాకాణితో చాలా కాలంగా గొడవలు పడుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో కలిసి మంతనాలు ప్రారంభించారు.
మరో వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆనం సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ ను అయిన తనకు పదవి ఇవ్వకపోయినా ఆయన ఫీల్ కావడం లేదు. కాకాణికి ఇచ్చినందుకు సంతోషంగానే ఉన్నారు. ఈ క్రమంలో నెల్లూరు వైసీపీ నేతలు.. రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.