ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌కు బదులు నగదు ఇవ్వాలని నిర్మయించింది. అయితే అందరికీ కాదని కోరుకున్నవారికేనని చెబుతోంది. ఆ కోరుకున్న వారెవరో ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు సంతకాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ .. కేంద్ర ఆహారభద్రతా చట్టం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని అంటున్నారు. అందులోని మార్గదర్శకాల వల్ల సగం మందికి కూడా కేంద్ర రేషన్ అందడం లేదు. మిగతా వారందరికీ ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు ఆ భారాన్ని దించుకోవడానికి వారికి నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే వాలంటీర్లు నగదు బదిలీ వల్ల ఎన్ని ప్రయోజనాలో చెబుతూ లబ్దిదారుల వద్దకు వెళ్తున్నారు. లబ్ధిదారుల నుంచి వ్యక్తిగతంగా అంగీకారపత్రంపై సంతకం తీసుకుంటున్నారు. అయితే నగదు బదిలీ తీసుకోవడం వల్ల కార్డులు రద్దవుతున్న భయం చాలా మందిలో ఉంది. డబ్బులు తీసుకున్నా కార్డులను రద్దు చేయబోమని వాలంటీర్లు చెబుతున్నారు. ఒకవేళ జాతీయ ఆహార భద్రతా చట్టం అమలవుతున్న కార్డుదారులు డిబిటిలోకి రావాలంటే ఆ పథకం నుంచి బయటకు రావాల్సి ఉంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలైన విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నారు.
నిరుపేదలకు రేషన్‌కు బదులుగా కేజీని రూ. పది నుంచి రూ. పన్నెండు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం సన్న బియ్యం.. రేషన్ బియ్యం అని రకరకాల కారణాలు చెబుతోంది. ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి బియ్యం అయినా రూ . నలబైకు తక్కువ లేవు. ప్రభుత్వం మరీ పది రూపాయలే ఇస్తామనడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అదే సమయంలో పేదలు తమకు బియ్యం ద్వారా వచ్చిన నగదును మద్యానికి ఖర్చు చేసే ప్రమాదం ఉంది . ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కోసం ఇలా చేస్తున్నా.. ఇది పేదలను మరింత కష్టాల్లోకి నెడుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు.
మరో వైపు ఇంటింటికి రేషన్ బదిలీ పేరుతో వందల కోట్లు పెట్టి వాహనాలు కొనుగోలు చేసి.. వాటికి ఆపరేటర్లను నియమించి హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు నగదు బదిలీ కి నిర్ణయించడంతో వారినేం చేస్తారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది.