ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ జడ శ్రవణ్ కుమార్ అంటే ఇప్పుడు ప్రత్యేకగా పరిచయం అక్కర్లేదు. కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన లాయర్లలో ఆయన ఒకరు. మాజీ న్యాయమూర్తి అయిన జడ శ్రవణ్ కొత్త పార్టీ పెట్టారు . కొంత కాలంగా ఆయన జై భీం యాక్సెస్ పేరుతో ఓ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘జై భీం భారత్ పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దళిత బిడ్డల కోసమే జై భీం భారత్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.
ఇతర పార్టీలు దళితుల పక్షపాతి అని మోసం చేస్తున్నాయని తప్పుబట్టారు. దళిత హోంమంత్రి ఉన్నా న్యాయం జరగడం లేదని శ్రవణ్ కుమార్ విమర్శించారు. జడ శ్రవణ్ కుమార్ రాజధాని రైతుల కేసులు, విశాఖలో వైద్యుడు సుధాకర్ కేసుల్లో బాధితులకు అండగా నిలిచారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా.. ఆయన బాధితులకు అండగా నిలిచేవారు. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు, అవినీతి లేని పాలన కోసం కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఆయన కోర్టులో పిటిషన్లు వేశారు. ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఊరూపేరూ లేని కంపెనీలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారని.. అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కనీస ప్రాధమిక ఆధారాలు చూపించలేక పోయారు. వైసీపీ వచ్చిన తరవాత ఆ ప్రభుత్వంపైనా పోరాడుతున్నారు. ఆయన దళితుల కోసం ప్రత్యేకంగా పని చేస్తూండటంతో ఆ వర్గంలో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేరుగా పార్టీ పెట్టారు.