” ఎజిటేషన్ ఇన్ నేషన్ హెల్ప్స్ దోస్ పొలిటిషియన్స్ ఇన్ మాస్ పొలరైజేషన్ !” రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యూహం ఇది. కానీ దీన్ని అమలు చేయాలంటే గట్స్ ఉండాలి. ప్రజల్నీ అడ్డంగా చీల్చగలిగే ధైర్యం ఉండాలి. మన పదవుల కోసం వాళ్ల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకు అన్న భావన ఏ కోశానా ఉన్న వారు ఫెయిలవుతారు. అలాంటి సహజంగా రాజకీయాల్లో అవకాశాలు అందిపుచ్చుకోలేరు. పుచ్చుకుంటే మాత్రం ఎవరూ ఆపలేరు. దేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని దీన్ని ఉదాహరణగా చూపించుకోవచ్చు. ఎన్నార్సీలు.. హిజాబ్‌లు.. హలాల్‌ల పేరుతో వీలైనంత వరకూ దేశాన్ని విడగొట్టేస్తున్న ఆ పార్టీ భావజాలం తాజాగా భాష మీదకూ మళ్లింది. ఒక దేశం.. ఒకే విధానం అన్నట్లుగా ఉన్న ఆ పార్టీ శైలి.. ఒక దేశం.. ఒకే పార్టీ అన్నట్లుగా మార్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే హిందీ భాషను జాతీయ భాషగా చేయాలనుకుంటోంది. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయం హిందీ కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలే దీనికి నిదర్శనం. ఆయన ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు వాస్తవానికి అది అన్ని ప్రాంతీయ భాషలకు ప్రత్యామ్నాయం చేద్దామన్న ఆలోచన షా మాటల్లో ఉందని విశ్లేషించి చెప్పాల్సిన పని లేదు.
హిందీ పేరుతో దేశాన్ని కలుపుతారా ? విడగొడతారా ?
భారతదేశం ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం . ప్రజలందరికీ వారి వారి భాషల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. దక్షిణాదిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. హిందీని బలవంతంగా రుద్దడంపై దక్షిణాది రాష్ట్రాల్లో ముందు నుంచీ తీవ్ర వ్యతిరేక ఉంది. హిందీ గురించి అమిత్ షా కామెంట్ చేయగానే దక్షిణాదికి చెందిన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇది ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి బిజెపి చేస్తున్న యత్నాలను అడ్డుకొంటామని ప్రాంతీయభాషలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోని పార్టీలు ప్రకటించాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై బిజెపి సాంస్కృతిక ఉగ్రవాదానికి తెగబడుతున్నదని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ‘భారత ప్రజలు ఏం తినాలి.. ఏం మాట్లాడాలి అనేది వారికే వదిలేయాలి’ అని తెలంగాణ మంత్రి కెటిఆర్ కూడా స్పష్టంచేశారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆయన ఆందోళన. ఇదే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉంది.
హిందీ అధికార భ ాషనా ? జాతీయ భాషనా ?
‘హిందీ అధికార భాషే కానీ, జాతీయ భాష కాదు’ ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి. కానీ బీజేపీ అధికార భాషనే జాతీయ భాష అన్నట్లుగా సూత్రీకరిస్తోంది. భారత దేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలుగా ఉన్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తున్నారు. ‘వేరువేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు స్థానిక భాషలు, ఇంగ్లిష్‌లో కాకుండా తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అంటున్నారు. హిందీ భాష కన్నా ప్రాచీనమైన భాషలు భారత్‌లో ఉన్నాయి. సంస్కృతం, ఉర్దూ, ఇతర భాషల మిశ్రమం హిందీ. కానీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటివి ప్రత్యేకమైనవి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళనలు పెల్లుబికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు. ఇప్పుడు దీన్ని మార్చాలని అనుకుంటున్నారేమో కానీ కొత్త వాదనలు తెరపైకి తీసుకు వస్తున్నారు.
భాష వల్లే పాకిస్థాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ !
భాషను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి, అందులో ఒకటి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించడానికి ప్రధాన కారణం భాషే. ముస్లింలు అయినా బంగ్లాదేశీయుల మాతృభాష బెంగాలీ. భాష అనేది కేవలం భావాలు వ్యక్తం చేయడమే కాదు.. ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. అందుకే బంగ్లాదేశీయులు పోరాడి స్వదేశాన్ని సాధించుకున్నారు దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడేవారు 60 శాతం మంది ఉంటే… హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతం మంది ఉంటారు. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా, ఉద్యోగావకాశాలకు షరతుగా విధించినా ఆందోళనలు చెలరేగే ప్రమాదముంది. అలాంటి చర్యలు హిందీ భాషపై తీవ్ర విముఖతను పెంచుతాయి. దేశం మనుగడకు ఒకే ఒక్క అధికారిక భాష ఉండాల్సిన అవసరం లేదు. ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశం ఒకే ఒక్క అధికారిక భాషను అమలు చెయ్యకుండా మనుగడలో ఉంది. ఇప్పుడు కొత్తగా సమస్యలు ఉన్నట్లుగా ప్రచారం చేయడం రాజకీయమే.
భాషను నేర్చుకోమని ప్రోత్సహించడం వేరు .. బలవంతం చేయడం వేరు !
ఇప్పుడు ప్రపంచమే కుగ్రామం అయింది . టెక్నాలజీ చేతుల్లో ఇమిడిపోయింది. ఏ భాష వ్యక్తులయినా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం పెద్ద సమస్య కాదు. పైగా ఇప్పుడు చదువుకుంటున్న వారంతా రెండు, మూడుభాషల్లో ఖచ్చితంగా ప్రావీణ్యం సంపాదించే వారే ఉంటున్నారు. బతుకుదెరువు కోసం తప్పదనుకుంటున్నారు. ఇలాంటి చైతన్యం వస్తే తప్పు లేదు. కానీ బలవంతంగా హిందీ నేర్చుకోవాలన్న ఒత్తిడి చేస్తే పరిస్థితి వేరుగా మారుతుంది. రాజకీయ అంశమవుతుంది. బహుశా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా .. ఈ అంశం రాజకీయం అయితే చాలనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ హిందీ గురించి బీజేపీ నేతలు ఒక్కటిమట్లాడితే.. దక్షిణాది నేతలు పది మాట్లాడతారు. ఎవరికైనా రాజకీయమే కావాలి. దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నారని ఇక్కడి నేతలు ప్రచారం చేస్తే బీజేపీకి ఇబ్బందే. అయితే అయితే అదే సమయంలో .. వారు ఉత్తరాదిలో ఈ సెంటిమెంట్ పండించుకోవచ్చు. ఎవరి రాజకీయం వారిది. కానీ ప్రజల్ని విడదీస్తేనే మొదటికే మోసం వస్తుంది.
కొత్త విద్యావిధానంతో భాషా దురాక్రమణకు ఇప్పటికే ప్రయత్నం !
దక్షిణాదిపై.. కేంద్ర ప్రభుత్వం భాషా దురాక్రమణకు ప్రయత్నించారు. నూతన విద్యావిధానం పేరుతో.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ హిందీని తప్పని సరి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం దాదాపుగా ఆమోదించే స్థితికి చేరింది. కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సులంటూ… కేంద్రం… దక్షిణాదిన … హిందీ రుద్దేందుకు… అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కస్తూరీ రంగన్ కమిటీ.. మూడు భాషల విధానాన్ని ప్రతిపాదించింది. అందులో ఒకటి… స్థానిక భాష, రెండు జాతీయ భాష హిందీ, మూడోది ఇంగ్లిష్. ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకోవాలన్నది… కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సు. ఇది.. దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో కాస్త తగ్గింది. నూతన విద్యావిధానంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా విధానాన్ని నిర్బంధంగా అమలు చేయాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు చేసిది. హిందీ నేర్వని రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీ భాషను నిర్బంధంగా అమలు చేయబోమని స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే అప్పటి ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాలకు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు కేంద్రం.. నిర్బంధం చేయడానికి ప్రయత్నిస్తోంది.
తెలుగు రాష్ట్రాల విధానం ఏమిటి..?
కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై దక్షిణాది నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. హిందీని.. బలవంతంగా రుద్ది… దక్షిణాది భాషల ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్నారన్న భావన చాలా మమందిలో వ్యక్తమవుతోంది. అదే తెలుగు లేదా… తమిళం, మలయాళం, కన్నడ భాషలను ఉత్తరాదిలో నేర్చుకునేందుకు … అక్కడ ఎందుకు ప్రొత్సహించరని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అలాంటి ఆలోచన కూడా చేయని వాళ్లు.. హిందీని దక్షిణాదిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండి పడుతున్నారు. హిందీని బలవంతంగా రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై… తెలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు గళమెత్తుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క పార్టీ కూడా.. ఈ వివాదంపై తన విధానమేంటో చెప్పలేదు. హిందీ ని కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని… బలవంతం చేస్తే.. అది.. అంతిమంగా తెలుగు భాష అస్థిత్వానికే ముప్పు తెచ్చి పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో… మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో.. పార్టీలు నడుస్తాయో… ఉత్తరాది ఆధిపత్యానికి తలొగ్గుతాయో వేచి చూడాలి..!
బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ – వన్ పాలసీ విధానంలోకి వెళ్తూ భారత భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఉనికి లేకుండా చేస్తోంది. అందరూ ఏం తినాలి, ఏం కట్టుకోవాలి.. ఏం చదువుకోవాలి అన్నది నిర్దేశించే స్థితికి చేరుతోంది. ఇది మంచా… చెడా అన్నది కాలమే నిర్మయించాలి.