ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి, రెండు సార్లు సూపర్ హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాడు రాజమౌళి. `బాహుబలి` కథని రెండు భాగాలుగా తీసి – రెండుసార్లూ సంచలన విజయాలు నమోదు చేసుకున్నాడు. అది కూడా సీక్వెలో, ప్రీక్వెలో కాదు. రెండో భాగం అంతే. ఓ విస్తారమైన కథ దొరికినప్పుడు.. ఇలాక్కూడా వాడుకోవచ్చని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పాడు రాజమౌళి. అయితే ఈ ఫీట్ అన్ని వేళలా సాధ్యమా? అందరికీ సాధ్యమా? అంటే కాదు. అయితే ఇప్పుడు రాజమౌళి దారిలోనే ప్రశాంత్ నీల్ వెళ్లాడు. తను కూడా `కేజీఎఫ్` ని చాప్టర్ 1, చాప్టర్ 2లా విడగొట్టి – రెండు సార్లూ.. నివ్వెరపోయే విజయాల్నే అందుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి సరసన నిలిచాడు.
సౌత్ సినిమాలపై బాలీవుడ్ కూడా చూసేలా చేసిన ఘనత.. రాజమౌళిది. బాహుబలితో సౌత్ సత్తా తెలిసింది. అయితే కేజీఎఫ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అర్థమైంది. కేజీఎఫ్ 2 అనగానే, అది కేజీఎఫ్ 1ని మురిపిస్తుందా, లేదంటే కేజీఎఫ్ క్రేజ్‌ని వాడుకోవడానికి తీస్తున్నారా? అనే అనుమానాల్ని పెంచింది. పైగా కేజీఎఫ్ లో లేని స్టార్ గణాన్ని.. చాప్టర్ 2 కోసం తీసుకొచ్చాడు. ఇది కేవలంహైప్ కోసమే అనుకున్నారంతా. కానీ.. కేజీఎఫ్ 2 చూశాక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. కేజీఎఫ్ విజయం… గాలివాటుగా రాలేదని, అది నిజంగానే తుఫానే అని తేలిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ని… భుజాలపై ఎక్కించుకుని మోస్తున్నారు సినిమా జనాలు. దక్షిణాదిన పవర్ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన.. రాజమౌళి తదుపరి స్థానం ప్రశాంత్ నీల్ దే అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
నిజానికి… కొన్ని విషయాల్లో రాజమౌళిని దాటేశాడు ప్రశాంత్ నీల్. ఎలివేషన్లలో రాజమౌళిని మించినవాడు లేడు.. అని నిన్నా మొన్నటి వరకూ చిత్రసీమ గట్టిగా నమ్మింది. అయితే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. సినిమాకి ఒకటో రెండో హీరో ఎలివేషన్లు ఉంటాయి. కానీ ప్రశాంత్ నీల్.. హీరో కనిపించే ప్రతీ సీన్‌ని ఓ ఎలివేషన్ గా మార్చుకున్నాడు. అవన్నీ గూజ్‌బమ్ మూమెంట్సే. చాప్టర్ 1లో ఇచ్చిన ఎలివేషన్లకు పిచ్చెక్కిపోయింది జనాలకు. చాప్టర్ 2లోనూ అదే స్థాయిలో హీరోని చూపించిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. పైగా.. ప్రశాంత్ నీల్ బలం… సంభాషణలు. తన సినిమాకి తానే డైలాగులు రాసుకుంటాడు. డైలాగుతో ఇచ్చిన ఎలివేషన్ అయితే మామూలుగా లేవు. ఈ రెండు విషయాల్లోనూ రాజమౌళిని దాటేశాడు ప్రశాంత్ నీల్.