అన్ని రాష్ట్రాల్లోనూ హడావుడి చేస్తున్న బీజేపీ నేతలు ఏపీలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. వారెందుకు రాజకీయ కార్యక్రమాలు చేపట్టరు అని జనం కూడా ఆలోచించరు. ఇటీవల సోము వీర్రాజు ఉత్తరాంధ్ర యాత్ర అని ప్రారంభించారు కానీ పట్టించుకున్నవారు లేరు. కేంద్రమంత్రులు ఎవరూ రాకపోవడం … జాతీయ స్థాయి నాయకులు అనేవారు ఏపీవైపు చూడకపోవడంతో ఏపీలో పార్టీకి అసలు ఎలాంటి ప్రచారమూ దక్కడం లేదు. ఉనికి కనిపించడం లేదు . వస్తే జీవీఎల్ లేకపోతే ఇంకెవరూ రాలేదు. జీవీఎల్ చెప్పే మాటలు విని విని ఏపీ ప్రజలకు విసుగొచ్చింది.
ఒకే క్యాసెట్‌ను పదే పదే రిపీట్ చేస్తూంటారు ఆయన. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి… ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్‌కు వచ్చిందేమో కానీ.. కేంద్ర మంత్రుల్ని ఏదైనా కార్యక్రమాలకు ఏపీకి పంపాలని నిర్ణయించుకుంది. అధికారిక కార్యక్రమం మీద వచ్చినా పార్టీ కార్యక్రమాలు సహజంగానే ఉంటాయి కాబట్టి ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ నెలలోనే పీయూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రధాన్, జైశంకర్ వంటి కేంద్రమంత్రులు ఒక్కో వారం ఒక్కొక్కరు ఏపీలో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారైంది.
వారు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో స్పష్టత లేదు కానీ.. కేంద్రమంత్రులు వస్తున్నారంటే కాస్త రాజకీయం ఉండటం సహజమే . దీన్ని ఎలా బీజేపీ వాడుకుటుందనేది కీలకం. వచ్చిన వారు ముఖ్యమంత్రితో సమావేశమైతే.. మొత్తానికే మోసం వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. ఏదైనా కొంచం మైలేజీకి చాన్స్ ఉంటుంది. కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయా అనేదే ఏపీ బీజేపీ నేతల ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది.