దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అనే పేరు పెట్టాలని సీఎం జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సవాల్ చేశారు. నిజామాబాద్ వర్నిలో తెలంగాణ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమేళనంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా తమ సామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీ సర్కార్ కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని కమ్మరావతిగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్‌కి ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలన్నారు.
కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువగా చూస్తే జగన్‌కే నష్టమని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. కమ్మ వారి మంచితనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు ఉన్నా, ప్రభుత్వం ఒక కులాన్నే టార్గెట్ చేసి మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. వైసీపీ నేతలు, జగన్‌కి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. అధికారం ఉందని రెచ్చిపోదన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఏపీ సీఎం జగన్ … ఓ కులం పై వ్యతిరేకతనే ఆసరగా చేసుకుని రాజకీయాలు నడుపుతున్నారు. ఈ విషయంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కులాలను టార్గెట్ చేసుకుని చేస్తున్న రాజకీయాల వల్ల ఆ సామాజికవర్గంలో అసహనం పెరుగుతోంది. అయితే సీఎం జగన్ కేవలం ఒక్క సామాజికవర్గం మాత్రమే కాదని.. తమకు ఓట్లు వేయరని భావించే అన్ని కులాలను అలాగే చూస్తున్నారని అంటున్నారు.