ఏ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా… పొగడ్డం, పొగిడించుకోవడమే కనిపిస్తుంటాయి. `ఆచార్య` కూడా అందుకు భిన్నంగా ఏం సాగలేదు. `ఆచార్య` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరు మైకు పట్టుకున్నా.. చిరు డాన్సుల గురించో, ఫైటుల గురించో, పెద్దరికం గురించో, మంచితనం గురించో మాట్లాడేవాళ్లే. చిరు కూడా అంతే. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తాడు. `భారతీయ చలన చిత్రరంగం ఓ మతమైతే… రాజమౌళి పీఠాధిపతి` అని కితాబు ఇచ్చాడు. నిజానికి ఇలా పొగడ్డంలోనూ ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు రాజమౌళి. తెలుగు సినిమా అంటే ఇదీ.. అనిచూపించాడు. మొన్నటి పుష్షకైనా, నిన్నటి కేజీఎఫ్‌కి అయినా.. అంతటి ఆదరణ వచ్చిందంటే దానికి బీజం వేసింది రాజమౌళినే. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే చెప్పుకునేవారు. బాలీవుడ్ కూడా అదే భ్రమలో ఉండేది. దాన్ని పటాపంచలు చేసింది రాజమౌళినే. అందుకే చిరు పొగడ్డంలో ఏమాత్రం తప్పులేదు.
ఈ వేదికపైనే చిరు మరో విషయం కూడా చెప్పాడు. ఆచార్య సినిమా వర్కవుట్ అవ్వడానికి కారణం.. రాజమౌళినే అని. అదెలా అంటే… అటు రాజమౌళితోనూ, ఇటు కొరటాలతోనూ ఒకేసారి చరణ్‌కు ఆఫర్లు వచ్చాయి. చరణ్ – కొరటాల సినిమా దాదాపుగా ఫిక్సయిన వేళ.. రాజమౌళి నుంచి చరణ్‌కు పిలుపు వచ్చింది. కొరటాల సినిమాని పక్కన పెడితే తప్ప రాజమౌళి సినిమా ని చరణ్ ఒకే చేయలేడు. ఇంత సున్నితమైన విషయాన్ని చిరు తెలివిగా పరిష్కరించుకోగలిగాడు. ఓ రోజు కొరటాలని ఇంటికి పిలిచి… `చరణ్ తో కాకుండా నాతో సినిమా చేస్తావా` అని చిరు కొరటాలని అభ్యర్థనగా అడగడం, దానికి కొరటాల సంతోషంగా ఒప్పుకోవడం జరిగిపోయాయి. అలా.. చిరుతో కొరటాల కాంబో సెట్టయ్యింది.
అయితే ఆచార్యలో ఓ కీలకమైన పాత్ర చరణ్ మాత్రమే పోషించగలడు అనిపించినప్పుడు కూడా రాజమౌళినే ఆపన్న హస్తం అందించాల్సివచ్చింది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో లాక్ అయిపోయిన చరణ్.. ఆచార్యలోకి అడుగుపెట్టడానికి రాజమౌళి అందించిన సహకారం మర్చిపోలేదని ఈ సందర్భంగా చిరు గుర్తు చేసుకున్నారు. ”రాజమౌళి సినిమా ఒప్పుకుంటే.. ఏ హీరో అయినా లాక్ పడిపోయినట్టే. అయితే.. ఈసారి నేను లేడీస్ సెంటిమెంట్ ని వాడాను. ‘సురేఖ డ్రీమ్ ప్రాజెక్టు ఇది.. నన్ను చరణ్‌ని ఒకే సినిమాలో చూడాలి అనుకుంటోంది’ అని చెప్పా. అప్పుడు రాజమౌళి ఒప్పుకున్నాడు. ఆచార్య సినిమాలో చరణ్ రావడానికి కారణం.. రాజమౌళినే” అని చిరు చెప్పుకొచ్చాడు.