చిరంజీవి అంటే… ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? దర్శక ధీరుడు రాజమౌళి కూడా చిరుకి అభిమానినే. ఈ విషయం ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. `ఆచార్య` ప్రీ రిలీజ్ వేడుకలోనూ చిరుపై తన అభిమానాన్ని చాటుకునేలా మాట్లాడారు రాజమౌళి. “ఇంత పెద్ద విజయాల్ని అందుకున్నప్పుడు కూడా మీరు ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు? అని నన్నంతా అడుగుతారు. ఇదంతా చిరంజీవిగారిని చూసే నేర్చుకున్నా. ఆయన సాధించిన వాటితో పోలిస్తే.. నేనెంత? ఎంత ఎదిగినా చిరంజీవి గారి కాళ్లు నేల మీదే ఉంటాయి. ఆయన మనకు అన్నీ నేర్పారు. వినయంగా ఎలా ఉండాలో కూడా నేర్పారు“ అని తన ప్రేమని, ఇష్టాన్నీ వెల్లబుచ్చాడు రాజమౌళి.
చిరు, చరణ్‌లు ఒకే సారి, ఒకే తెరపై కనిపిస్తారు, కలిసి నటిస్తారు అనగానే ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఎక్కువ నడుస్తుంది? అనే చర్చ మొదలైంది. `భలే బంజరా` పాట విడుదలైనప్పుడు కూడా దీని గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఈ డామినేషన్ విషయంలోనూ రాజమౌళి తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేశారు. ”చిరంజీవిగారిలో పోటీ తత్వం నాకు నచ్చుతుంది. తన పక్కన నటిస్తోంది తన కొడుకైనా సరే, తనని కూడా డామినేట్ చేయాలని అనుకుంటారు. ఓ అభిమానిగా.. చిరంజీవి గారే ఎప్పుడూ గెలవాలని అనుకుంటా. కానీ చరణ్ దర్శకుడిగా… నా హీరో చరణ్ ఓ మెట్టుపైన ఉండాలని అనిపిస్తుంది” అని బాలెన్స్డ్గా మాట్లాడారు రాజమౌళి.
ఈ సందర్భంగా కొరటాల శివ పనితనాన్ని కూడా రాజమౌళి మెచ్చుకున్నారు. కొరటాల చూడ్డానికి చాలా క్లాస్ గా కనిపిస్తారు కానీ, చాలా మాస్ డైరెక్టర్ అని కితాబిచ్చారు. ”మిర్చి చూశాక.. ఇండస్ట్రీకి ఓ మాస్ డైరెక్టర్ వచ్చాడనిపించింది. అయితే ఆ తరవాత ఆయన రూటు మార్చి సందేశాత్మక హీరోయిజం ఉన్న సినిమాలు తీశారు. `ఆచార్య`తో ఆయన మళ్లీ పర్ఫెక్ట్ మాస్ సినిమా తీశాడనిపిస్తోంది. కొరటాల అలా కనిపిస్తున్నాడు కదా అని ఆయన్ని చూసి మోసపోవద్దు. ఆయన మహా మాస్..” అని చెప్పుకొచ్చారు.. జక్కన్న.