ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి అతిథి అనగానే… రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. `ఈ వేదికపై చిరంజీవి రాజమౌళిల సినిమా ఎనౌన్స్మెంట్ ఉంటుంది` అనే వార్తలొచ్చాయి. సాధారణంగా ఓ వేదికపై అగ్ర దర్శకుడు, పెద్ద హీరో కలిస్తే.. ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడన్న ప్రశ్న వస్తుంది. మొహమాటం కోసమైనా.. తప్పకుండా మేం సినిమా చేస్తాం.. అని అభిమానులకు మాట ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వరకు కూడా ఇంతే. ఓ సినిమా వేడుకకు త్రివిక్రమ్ అతిథిగా వచ్చినప్పుడు, అదే వేదికపై చిరంజీవి కూడా ఉన్నప్పుడు.. `మేమిద్దరం కలిసి సినిమా చేస్తాం` అనే రేంజులో.. చిరు, త్రివిక్రమ్ మాట్లాడుకున్నారు. ఆ ఫంక్షన్ తరవాత.. చిరు – త్రివిక్రమ్ కాంబోలో సినిమా అన్నట్టు ప్రచారం జరిగింది. ఆ సినిమా ఏమైందో ఇప్పటి వరకూ తెలీదు.
సరిగ్గా అదే సీన్.. `ఆచార్య`లోనూ రిపీట్ అవుతుందని భావించారు. చిరు, రాజమౌళి ఒకే వేదికపై ఉంటారు కాబట్టి. కచ్చితంగా వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడన్న క్వశ్చన్ వస్తుందని, దానికి సమాధానంగా `ఎస్. చేసేస్తున్నాం` అంటారని ఊహించారంతా. దానికి తగ్గట్టు కొన్ని వెబ్ సైట్లు.. `సినిమా ఎనౌన్స్మెంట్ ఉంటుందహో` అని డప్పుకట్టాయి. తీరా చూస్తే… చిరు మాటల్లో గానీ, రాజమౌళి స్పీచులో గానీ.. ఈ కాంబోపై కబురే లేదు. అసలు ఆ టాపిక్కే రాలేదు. సో… చిరు – రాజమౌళి కాంబో గురించి ఇంకొన్నాళ్లు చడీ చప్పుడూ లేనట్టే.