కాంగ్రెస్ పార్టీకి వీర సైనికుడిగా పని చేసేందుకు పీకే సిద్దమయ్యారు. ఆ పార్టీ ఏం చేస్తే బాగుపడుతుందో ప్రజెంటేషన్ ఇచ్చారు. అలా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్లీ కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ప్రత్యక్షమయ్యారు. తాను టీఆర్ఎస్కే పని చేస్తానని హామీ ఇచ్చారు. సర్వే రిపోర్టులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చాలా ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినా కేసీఆర్ ఆయనను నమ్ముకుని వ్యూహ బాధ్యతలు ఇవ్వాలనుకోవడమే టీఆర్ఎస్ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది.
ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను టీఆర్ఎస్కు పని చేస్తానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎలా పుంజుకోవాలో కూడా ఆయనే సలహాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే.. టీఆర్ఎస్ను దెబ్బకొట్టి కాంగ్రెస్ను గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. కాంగ్రెస్కు ఎక్కువ ఆశలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అలాంటిది రెండు పార్టీలకు పీకే పని చేస్తే ప్రయోజనం ఏమిటి?
కేసీఆర్ పీకే లాంటి వ్యూహకర్తల్ని నమ్మడమే అసాధారణం అనుకుంటే.. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్తో పాటు తమ పార్టీకి చేస్తామన్నా అంగీకరించడం మరింత అసాధారణంగా కనిపిస్తోంది. కేసీఆర్ పూర్తిగా పీకే మాయలో ఉన్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ రెండు పార్టీలకు పని చేస్తే… అది రెండు పార్టీలకూ ముప్పే.. ఆ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అయినా… టీఆర్ఎస్ అయినా .. తమకు ముప్పు లేకుండా ఉండాలంటే జాగ్రత్త పడాల్సిందే.