లగడపాటి రాజగోపాల్ తాను ఎంపీగా ఉన్నప్పుడు తన అనుచరునిగా ఉన్న ఓ నేత కుటుంబసభ్యుడు చనిపోవడంతో పరామర్శించడానికి మైలవరం నియోజకవర్గానికి వెళ్లారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. లగడపాటి వస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వచ్చారు. ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడే లంచ్ చేసి బయలుదేరి వెళ్లారు. అంతే.. మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి అంటూ ప్రచారం ప్రారంభించేశారు వైసీపీ నేతలు. అనూహ్యంగా ఈ సారి వైసీపీ నేతలు తమ పార్టీ తరపున లగడపాటి బరిలోకి దిగబోతున్నారని చెబుతున్నారు.
అక్కడ సమావేశం అయింది వైసీపీ నేతలతో కాబట్టి అలా చెప్పడానికి ఆధారం లభించింది. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం మానుకున్నారు. ఆ తర్వాత సర్వేలు మాత్రం చేస్తున్నారు. తెలంగామ ముందస్తు ఎన్నికలు… ఏపీ ఎన్నికల్లో ఆయన సర్వేలు ఫెయిల్ కావడంతో ఇక సర్వేలు కూడా మానేస్తున్నానని ప్రకటించారు. అంటే అటు ప్రత్యక్ష రాజకీయాలు.. ఇటు సర్వేలు అన్నీ మానుకున్నారు. కానీ వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నారు.
లగడపాటి ఎప్పుడు బయట కనిపించినా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పడం కామన్ అయిపోయింది. కానీ లగడపాటి మాత్రం అది ముగిసిన అధ్యాయం అని చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి ఆ మేరకు రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి లగడపాటి మాత్రమే. విభజన జరిగిపోయి పదేళ్లవుతోంది కాబట్టి ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో కానీ ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.