ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తన సంస్థ ఐ ప్యాక్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకుడా ఏర్పాట్లు చేసుకుని వెళ్లారు. టీఆర్ఎస్ ఐ ప్యాక్ సేవలు కొనసాగించాలని నిర్ణయించుకుంది. పీకే సేవలు కాదని తాము ఐ ప్యాక్ సేవలు తీసుకుంటామని కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడి ప్రకటించారు. కేసీఆరే అతి పెద్ద వ్యూహకర్త అయినప్పుడు ధర్డ్ పార్టీ అవసరం ఏమిటని జర్నలిస్టులు అడిగిన సందేహాలకు కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీలతో అనుబంధం లేకుండా పని చేసేవారు విలువైన సలహాలిస్తారన్నారు.
పీకే చేరబోతున్న పార్టీపై కేటీఆర్ తన తేలిక భావాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. అమేధీలో రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారని ఇక ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుందని తాము ఎలా అనుకుంటామని ఆయన ప్రశ్నించారు. తమకు గ్రౌండ్లో బలం లేకపోతే ఐ ప్యాక్ తమతో పని చేసేందుకు ఎందుకు అంగీకరిస్తుందని ఆయన ప్రశ్నించారు. గెలిచే పార్టీలకే ఐ ప్యాక్ పని చేస్తుందని టీఆర్ఎస్ కూడా మళ్లీ గెలవబోతోందని ఆయన ప్రకటిచారు. అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకత సహజమేనని కానీ అది టీఆర్ఎస్పై ఓడిపోయేంతలేదన్నారు.
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి తాము ఎలా గెలవాలో రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటామన్నారు. ఎన్డీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అలయెన్స్ అని.. విశ్లేషించారు. బీజేపీ వల్ల దేశానికి ఎటు వంటి లాభం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట్ల మాత్రమే బీజేపీ గెలుస్తోందని ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల గెలవడంలేదని కేటీఆర్ విశ్లేషించారు. బీజేపీకి విషయం లేదని కానీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. బండి సంజయ్‌ను జోకర్‌గా అభివర్ణించారు.
ఫైనల్‌గా ప్రశాంత్ కిషోర్.. తన సంస్థ ఐ ప్యాక్‌ను టీఆర్ఎస్ సేవలకు కాంట్రాక్ట్ తీసుకోగలిగారు. ఆయన నేరుగా టీఆర్ఎస్కు ఇక సలహాలిస్తారోలేదో స్పష్టత లేదు. కాంగ్రెస్‌తో ఆయన డీల్ కుదిరితే… ఆయన టీఆర్ఎస్ ఓటమి కోసం కాంగ్రెస్ కోసం పని చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఆయన సంస్థ ఐ ప్యాక్ టీఆర్ఎస్ కోసం.. ఆయనేమో కాంగ్రెస్ కోసం పని చేస్తారన్నమాట.