పవన్ కల్యాణ్‌ను విమర్శించడానికి కాపు మంత్రులనే ప్రయోగించే వైసీపీ ఈ సారి మరింత ఎక్కువగా నోరు చేసుకునే వారికి మంత్రి పదవులు ఇచ్చింది. వారు తమకు ఎందుకు మంత్రి పదవులు వచ్చాయో సరిగ్గా తెలుసుకున్నారేమో కానీ చెలరేగిపోతున్నారు. కొత్తగా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ తన శాఖ గురించి ఒక్క సారి కూడా మాట్లాడారో లేదో కానీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్‌ను మాత్రం తిడుతున్నారు. ఆదివారం రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.
నలుగురిని పెళ్లి చేసుకున్న ఏ మాత్రం నైతికత విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుడివాడ అమర్నాథ్ ఏ మాత్రం సంకోచం లేకుండా విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా నలుగురు అని చెప్పారని ఇందులో విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. నలుగురిని పెళ్లి చేసుకున్న పవన్‌కళ్యాణ్‌కు వ్యక్తిత్వం లేదు. మంచి క్యారెక్టర్ అస్సలే లేదు. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ మా ప్రభుత్వంపైనా, సీఎంగారి పైనా విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
పైగా తాము చెబుతున్నది కాదు. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ స్వయంగా చెప్పారు. పవన్ ఎలాంటి వ్యక్తి అన్నది ఆమే స్వయంగా చెప్పారనిచెప్పుకొచ్చారు. తొలి భార్యది విశాఖపట్నం. ఆ తర్వాత రేణుదేశాయ్. ఇప్పుడు రష్యన్. అంటే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. అలా అందరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి జగన్‌గారి గురించి అనుచితంగా మాట్లాడుతున్నారని విమర్శించేశారు. రాజకీయాలను రాజకీయంగా చూడకుండా వ్యక్తిగత విమర్శలు కుటుంబాలపైకి వెళ్ళడంతో వైసీపీ నేతలు రాటుదేలిపోయారు. గతంలో నేరుగా జగన్ విమర్శించేవారు. అప్పుడు జనసేన అధినేత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లకు కూడా పవన్ కుటుంబం అంటే అలుసైపోయిందన్న ఆవేదన జనసేన నాయకుల్లో కనిపిస్తోంది.