ఏపీ సీఎం జగన్ నివాసం తాడేపల్లిలో ఉంటుంది. ఈ కారణంగా పోలీసుల భద్రత ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ రకంగా పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించేశారు. ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా అంగీకరించడంలేదు. తాడేపల్లి వైపు వెళ్ల జాతీయ రహదారులపై ఇనుప ముళ్ల కంచేలు కిలోమీటర్ల మేర వేశారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లు, రహదారులపై పోలీసులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అందర్నీ తనిఖీ చేసి.. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాలు ఉన్నారో లేరో చూసి ఆ తర్వాత వదిలి పెడుతున్నారు. ఇంత దిగ్భందం ఎప్పుడూ చూడలేదని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇదంతా ఎందుకంటే సోమవారం సీపీఎస్ రద్దుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. గతంలో చలో విజయవాడకు తరలి వచ్చిన వారిలో అత్యధికులు సీపీఎస్ ఉద్యోగులేనని గుర్తించడంతో ఈ సారి వారి చలో తాడేపల్లి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి యంత్రాంగం మొత్తాన్ని యాక్టివేట్ చేశారు. జిల్లాల్లోనే వారిని ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. నోటీసులు ఇస్తున్నారు. ఎవరూ విజయవాడ చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టీచర్లకు వేసవి సెలవులు కూడా రద్దు చేశారు. మే ఇరవయ్యో తేదీ వరకూ టీచర్లు విధిగా స్కూల్స్ రావాల్సిందేనని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందే సీఎం జగన్ టీచర్లతో బోదనేతర పనులు చేయించవద్దని ఆదేశించారు. మరి సెలవులు రద్దు చేసి వారితో ఏ పనులు చేయిస్తారో స్పష్టత లేదు. ఇంత కఠినంగా కట్టడి చేసిన ఉద్యోగులు.. బలప్రదర్శన చేస్తే ప్రభుత్వం పరువుపోయే ప్రమాదం ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిరసన ప్రదర్శనలకు భయపడి ఇంత భారీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోలేదన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.