పులివెందుల ప్రజలెవరూ ఊహించని ఫిష్ ఆంధ్ర స్టాల్ తీసుకు వచ్చానని బహిరంగసభలో తనను తాను పొగుడుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అతిశయం నెల రోజులకు చల్లబడిపోయింది. ఆయ ప్రారంభించిన స్టాల్లో కొనేవారు లేక.. ఆదాయం లేక.., కరెంట్ బిల్లులు చెల్లించలేక నిర్వాహకులు మూసేశారు. ఫిష్ ఆంధ్ర స్టాల్ పూర్తి స్థాయిలో ప్రభుత్వానిది కాదు. సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పులివెందులలో కూడా సబ్సిడీతో ఇతర వ్యక్తులు ఏర్పాటు చేశారు. లక్షలు ఖర్చు పెట్టారు. ఆధునిక యంత్రాలు తీసుకు వచ్చారు. అయితే నెలకే మూత పడింది.
పులివెందులకు అలాంటి దుకాణం వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని సీఎం జగన్ ఆశ్చర్య పోయారు కానీ.. ప్రజలు మాత్రం అలా అనుకోలేదు. తాము ఎప్పుడూ కొనుక్కునే చోటే మాంసాహారం కొనుగోలు చేస్తున్నారు. ఫిష్ ఆంధ్రా స్టాల్కు రావడంలేదు. దీంతో నెలకు రూ. లక్షన్నర కరెంట్ బిల్లు వచ్చింది కానీ అందులో సగం కూడా ఆదాయం రాలేదు. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇచ్చినా ప్రయోజనం లేదనుకున్నారేమో కానీ మూసేశారు. కరెంట్ బిల్లు కట్టలేదని కనెక్షన్ తీసేశారు. ఇప్పుడు టోటల్గా మూతపడింది.
జర్మనీ నుంచి తెప్పించినయంత్రాలు చెడిపోయాయని.. అందుకే మూతేశామని అధికారులు చెబుతున్నారు. నెలకే చెడిపోవడం ఓ వింత అయితే.. యంత్రాలు చెడిపోయాయని వ్యాపారాన్ని మూసేస్తారా అనేది మరో వింతైన జవాబు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆనందంగా.. గొప్పగా ఫీలైన ఫిష్ ఆంధ్ర స్టాల్ మాత్రం ఎంత వేగంగా ప్రారంభమైందో.. అంతే వేగంగా మూతపడింది.