హైదరాబాద్: పుష్కర ఘాట్లో శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టటమే ఇవాళ్టి తొక్కిసలాట ప్రమాదానికి కారణమన్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విగ్రహం అక్కడ పెట్టటం అపచారమని అన్నారు. పుష్కరఘాట్ దుర్ఘటనపై రఘువీరా ఇవాళ చిరంజీవితోకలిసి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ను చంపిన పాపాన్ని కడిగేసుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విగ్రహాన్ని పుష్కరఘాట్లో ఏర్పాటు చేశారని విమర్శించారు. అందుకు 27మందిని బలి ఇచ్చారని అన్నారు. పుష్కర ఏర్పాట్లన్నీ చంద్రబాబే చూసుకుంటున్నారని టీడీపీ నేతలే గొప్పగా చెప్పారని గుర్తుచేశారు. రాజమండ్రినుంచి చంద్రబాబు వెళ్ళిపోతే అధికారులు వారి పనులు వారు చూసుకుంటారని అన్నారు. పుష్కర మరణాలకు బాధ్యత వహించి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.