ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం సున్నితంగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ సీఎం జగన్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆధికారులను ఆదేశిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ కల్లా రాష్ట్రం మొత్తం మీటర్లు పెడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు.మీటర్లు పెట్టడమే కాదు.. బిల్లులు కూడా వారే కట్టుకోవాలి. ప్రభుత్వం రీ ఎంబర్స్ చేస్తుంది. అంటే ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసి ఉచిత విద్యుత్‌కు బదులుగా.. ఎంత కరెంట్ వినియోగిస్తే.. అంత డబ్బులిస్తామంటున్నారు. ఇది రైతుల్లో ఆందోళనకు కారణయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుందో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.
గ్యాస్ బండకు సబ్సిడీ ఎలా నగదు బదిలీ చేస్తున్నారో ఇప్పుడు కళ్ల ముందే ఉంది. సిలిండర్ ధర రూ. వెయ్యి దాటిపోయింది. ఇచ్చే సబ్సిడీ రూ. నలభైకు పడిపోయింది. నగదు బదిలిలో ఉండే మ్యాజిక్ అది. ఎవరూ అడగలేరు. ప్రభుత్వాలు… పథకాలకు బదులు తాము ఎందుకు నగదు బదిలీ చేయాలని కోరుకుంటాయో.. ఇదో పెద్ద ఉదాహరణ. ఈ గ్యాస్ సబ్సిడీనే… కేస్ స్టడీగా తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్ రైతులు … నగదు బదిలీ పేరుతో ఎలాంటి కష్టాల్లో చిక్కుకోబోతున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై రైతుల్లో క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తోంది.
మీటర్లు పెడితే రైతులు ఎంత వాడుకుంటే.. అంత చెల్లించి తీరాల్సిందే. ప్రభుత్వం ఇస్తుందని ఆశ పడాలి. ప్రస్తుతం జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం బిల్లులు జనరేట్ అవ్వగానే… వేల కోట్లు ఎలా తెచ్చి రైతుల ఖాతాల్లో వేస్తుందనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. ఎప్పుడైనా ప్రభుత్వం చెల్లించడం ఆలస్యం అయితే.. రైతులు విద్యుత్ సంస్థలకు బాకీ పడినట్లవుతుంది. అదే జరిగితే.. రైతను తర్వాత తర్వాత డిఫాల్టర్‌గా గుర్తించి బ్యాంకుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడతారు. ఈ విషయంలో రైతుల్లో ఆందోళన తీవ్ర తరం అయితే ఫ్యాన్ గుర్తుకు తేడా వచ్చేస్తుంది.అయినా జగన్ మాత్రం ముందకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.