కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణం పై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని కూడా నియమించింది. బక్కా జడ్సన్ అనే కాంగ్రెస్ నేత మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విచారణకు ఓ అధికారిని కూడా నియమించింది.
మిషన్ భగీరథ పథకానికి ఏడేళ్లలో రూ. 36 వేల కోట్ల ఖర్చు చేశారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. జల జీవన్ కమిషన్ ఇటీవలే ఈ పథకం అమలు తీరుపై సర్వే నిర్వహించింది. ఈ కమిషన్ సర్వే రిపోర్టు ఇటీవలే కేంద్రానికి అందగా… ఆ నివేదిక ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సగానికిపైగా పాత స్కీమ్ పైపులు, పాత ట్యాంకులు, పాత నల్లాలు, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మిషన్ భగీరథ స్కీమ్‌లో వాడుకుని కొత్తవి వేసినట్లుగా బిల్లులు పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కీమ్‌కు హడ్కో, కమర్షియల్ బ్యాంకుల నుంచి 80 శాతం నిధులు అప్పుగా.. మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు కేటాయించింది. ఈ నిధుల్లో గోల్ మాల్‌పై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించడం అనూహ్య పరిణామం. మిషన్ భగీరథ పైపుల కంపెనీల కోసం పెట్టారని.. ఆ పైపుల కంపెనీలు కేసీఆర్ కుటుంబసభ్యులవని చాలా కాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం సీరియస్‌గా విచారణ జరిపితే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఇది సీరియస్ విచారణ లేకపోతే.. ధాన్యం తరహా విచారణేనా అన్నది తేలాల్సి ఉంది.