రాజేంద్ర ప్రసాద్ కామెడీ కింగ్. కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు చేసే హీరో కొరత ఏర్పడింది. ఈ కొరతని భర్తీ చేశారు అల్లరి నరేష్. దర్శకుడు ఈవీవీ తనయునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, చేసిన మొదటి సినిమా ‘అల్లరి’ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు నరేష్. తొలి సినిమాతోనే తనకంటూ ఒక సేఫరేట్ ఐడెంటీటీ క్రియేట్ చేసుకున్నారు. నరేష్ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు అవుతుంది. ఈ ఇరవై ఏళ్ళు నరేష్ ప్రయాణం విలక్షణంగా సాగింది. ‘
అల్లరి తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు నరేష్. జెట్ స్పీడ్ తో సినిమాలు చేశారు. మినిమమ్ గ్యారెంటీ స్టార్ అనిపించుకున్నారు. ఒక దశలో ఏడాదికి ఎనిమిది సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ నరేష్. చేసిన సినిమాలన్నీ విజయాలు కాకపోవచ్చు. కానీ నరేష్ వేగం కారణంగా సినిమాలు పెరిగాయి, పరిశ్రమకు పని దొరికింది. నిజానికి కంటెంట్ డిమాండ్ వున్న ఈ కాలంలో నరేష్ లాంటి వేగం సినిమాలు చేయడం అవసరం.
నరేష్ సినీ ప్రయాణం కూడా చాలా వైవిధ్యంగా సాగింది. ఒక పక్క కామెడీ సినిమాలు చేస్తూనే మరో పక్క గొప్పగొప్ప దర్శకులతో పని చేశాడు. బాపు, కె, విశ్వనాద్, వంశీ, కృష్ణ వంశీ, క్రిష్ లాంటి దర్శకులతో పని చేసే అవకాశం అందుకున్నాడు. ఈ విషయంలో నరేష్ చాలా లక్కీ. కెరీర్ ని ఒక్కసారి సింహాలోకనం చేసుకుంటే .. ఈ దర్శకుల జాబితా కనిపించడం ఒక నటుడిగా నరేష్ కి ఒక గౌరవమే. ఇలాంటి అవకాశం అందరి నటులకు రాదు.
కేవలం కామెడీనే కాదు.. నరేష్ లో చాలా వర్సటైల్ నటుడు వున్నాడు. గమ్యం, శంబో శివ శంబో లో నరేష్ నటన దీనికి నిదర్శనం. నరేష్ లో క్యాలిబర్ ని ఈ చిత్రాలు కొత్తగా ఆవిష్కరించాయి. మహర్షి లో చేసిన పాత్ర కూడా నరేష్ లోని విలక్షణతకి అద్దం పట్టింది. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘నాంది’ సినిమా నరేష్ కి సెకండ్ ఇన్నింగ్స్. సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ నట విశ్వరూపం ఎలా వుంటుందో నాంది సినిమా మరోసారి రుజువుచేసింది. నరేష్ లోని నటుడికి తిరిగులేదు. ఇరవై ఏళ్ళు కాదు.. మరో అరవై ఏళ్ళయినా నరేష్ ప్రయాణం సరదా కాసేపులా హాయిగా సాగిపోతూనే వుంటుంది.