50 సినిమాలు తీసి, దర్శకుడిగా తనదంటూ ఓ ముద్ర వేశారు ఈవీవీ సత్యనారాయణ. జంథ్యాల తరవాత కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. కామెడీ సినిమాల్లో ఆయనదో ట్రెండ్. మెల్లగా బడా హీరోలతోనూ సినిమాలు తీసి హిట్లు కొట్టారు. నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీశారు. `ఆమె` ఆయన కెరీర్లో ఓ మైలురాయి. ఈవీవీ వారసుడిగా వచ్చిన నరేష్ – హీరోగా సెటిలయ్యాడు. అయితే అంతకు ముందు ఈవీవీ సినిమాలన్నింటికీ ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకునేవాడు నరేష్.
నరేష్ హీరో అయ్యాక.. ఈవీవీ దర్శకత్వంలో దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశారు. అందులో ఎక్కువ భాగం హిట్లే. అయితే… తండ్రి తీసిన సినిమాల్లో తనకు అస్సలు నచ్చని సినిమా ఒకటుందట. ఆ విషయాన్ని ఇటీవలే నరేష్ బయటపెట్టాడు. ”మా నాన్నగారు తీసిన సినిమాల్లో `ఆరుగురు పతివ్రతలు` అస్సలు నచ్చదు. కథ చెబుతున్నప్పుడే నాకు ఎక్కలేదు. `నాన్న.. ఇది నీ జోనర్ సినిమా కాదు కదా` అని చెప్పాను. కానీ ఆయన వినలేదు. చివరికి ఆ సినిమా కూడా నేను చూడలేదు. నాన్నగారు తీసిన సినిమాలలో నేను చూడనిది.. నాకు నచ్చనిది అదొక్కటే” అని చెప్పుకొచ్చాడు నరేష్. ఈవీవీ బతికున్నప్పుడే కొన్ని స్క్రిప్టులు రెడీ చేసి పెట్టుకున్నారు. నరేష్ మాత్రమే చేయగలిగే కథలవి. వాటి గురించి నరేష్ దగ్గర ప్రస్తావిస్తే.. ”ఆ సినిమాలు నాకూ చేయాలని ఉంది.కానీ తెరపైకి తీసుకొచ్చే దర్శకుడే లేడు. ఈమధ్య `జంబలకిడిపంబ`కి రీమేక్ చేద్దామని ఓ దర్శకుడు వచ్చాడు.కానీ నేను ఒప్పుకోలేదు. నరేష్ పాత్రని నేను ఏదోలా నడిపించేస్తా. కానీ… ఆ సినిమాలో చాలా మంచి పాత్రలున్నాయి. వాటికి రీప్లేస్మెంట్ దొరకదు” అని తేల్చి చెప్పేశాడు నరేష్.