” జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడింది.. అక్కడ ఉన్న గుడిని కూలగొట్టి ముస్లిం రాజు ముసీదు నిర్మించారు. ఇప్పుడు మళ్లీ గుడిని పునరుద్ధరించాలి” అన్న డిమాండ్ బయలుదేరింది. వెంటనే ఒవైసీ లాంటి వాళ్లు మేము బాబ్రీని వదులుకున్నాం.. ఇక జ్ఞానవాపిని వదులుకోవడానికి సిద్ధంగా లేం అని తెరపైకి వచ్చారు. విషయం సుప్రీంకోర్టుకు చేరింది. అయినప్పటికీ సందర్భానుసారం.. సమయానుసారం చూసుకుని జ్ఞానవాపిలో కరసేవ చేయరన్న గ్యారంటీ లేదు. లేకపోతే కాలం మారింది కాబట్టి అంతకు మించి ఏమైనా చేస్తారేమో తెలియదు కానీ.. వచ్చే ఏడాదికి అయోధ్యలో రామాలయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో జ్ఞానవాపికి అంతకు మించిన సమస్యగా మారబోతోంది. ఆ సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. అది ఎక్కడి వరకు వెళ్తుందో అంచనా వేయడం కష్టం.
జ్ఞానవాపి వివాదం ఎందుకు !?
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నాటి ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సి.ఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వారణాసి లోని జ్ఞానవాపి మసీదు, మధుర లోని షాహి ఈద్గాలు తమ తర్వాతి లక్ష్యమని ప్రకటించారు. నిజానికి అప్పటికే జ్ఞానవాపి మసీదు అంశంపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. వాటిపై విచారణ జరుగుతోంది. అవి అలా ఉండగానే మసీదు గోడలపై దేవతామూర్తుల చిత్రాలు ఉన్నాయని, వాటి వద్ద పూజలు జరుపుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌ని పరిగణలోకి తీసుకుని స్థానిక కోర్టు మసీదులో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే సర్వే పూర్తి కావడం, శివలింగం దొరికిందని కోర్టుకు చెప్పడం, ఆ స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశాలను స్థానిక కోర్టు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. సర్వే నివేదిక కోర్టుకు చేరకముందే మసీదు ఆవరణలోని బావిలో దొరికిన దానిని శివలింగంగా ధర్మాసనం నిర్ధారించింది. నిజానికి దిగువ కోర్టులో విచారణ సందర్భంగా పిటిషన్ల లాయర్ తమకు మూడడుగుల పొడవున్న రాయి దొరికిందని, దానిని తాము శివలింగం అంటున్నామని, మసీదు కమిటీ ఫౌంటెన్‌గా చెబుతున్నారని మీడియాకు వివరించారు. దీంతో వివాదం పై స్థాయికి వెళ్లింది.
చట్టం ప్రకారం జ్ఞానవాపిలో ఎలాంటి మార్పుచేర్పులు చేయరాదు !
1991లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.ఈ చట్ట ప్రకారం, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతులను మార్చకూడదు.ఇది దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలన్నిటికీ వర్తిస్తుంది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ఈ చట్టం పరిథిలోకే వస్తుంది. ఈ చట్టం ప్రకారం ప్రార్థనా స్థలాల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఏ వ్యక్తికీ లేదు. అదే చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం, 1947 ఆగస్టు 15న నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో, అలాగే కొనసాగుతాయి. సెక్షన్ 4(2) ప్రకారం, ప్రార్థనా స్థలాల స్వరూప, స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకు ముందు పెండిగ్లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పీటిషన్ వేసే వీలు లేదు. కోర్టు, ట్రిబ్యునల్, ప్రభుత్వ అధికారులు.. ఎవరి ముందూ ఏ దావాలూ చెల్లవు. ఈ చట్టంలో అయోధ్య ఒక్కదానికే మినహాయింపు ఇచ్చారు. ఆ చట్టం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నప్పటికీ… చట్టం మాత్రం అధికారికంగా కొనసాగుతుంది. ఈ లెక్కన చూస్తే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంతటితో ఆగవు.. ఇంకా చాలా చాలా ఉన్నాయి !
జ్ఞానవాపితోనే ఇది ఆగేది లేదు. త్వరలో తాజ్ మహల్ కు కూడా గండం పొంచి ఉంది. ఏకంగా న్యాయస్థానాలనే ఆశ్రయించారు కొంత మంది. తాజ్‌లో 22 గదులకు తాళాలు వేసి వుంటాయని వాటిని తెరిచి ఏముందో ప్రజలకు వెల్లడించాలని పిటిషన్లు కోర్టుల్లో వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసివేసింది. కానీ వెంటనే బిజెపి ఎం.పి దివ్య తాజ్‌మహల్ కట్టిన స్థలం మాదేనని ఒక వాదన లేవదీశారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన దివ్య తమ తాతముత్తాతల కాలం నాటి స్థలాన్ని మొఘలాయిలు తీసుకున్నారనడానికి పత్రాలున్నాయన్నారు. కానీ బయట పెట్టలేదు. గతంలోనూ పలుమార్లు కొన్ని గ్రూపులు తాజ్‌మహల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాలు లేవదీయడం జరుగుతూనే వుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా వుందనేది వాస్తవం. దేశవ్యాపితంగా ఎక్కడికక్కడ ఏదో ఒక వివాదం రగిలించి విద్వేషం పెంచడం సర్వసాధారణం అయిపోయింది. కర్ణాటకలో వరుసగా హిజాబ్, హలాల్, ఆజాన్‌లాంటివి వివాదాస్పదం అయ్యాయి. దేశంలో ప్రతీ చోటా ఇలాంటి వాటినే హైలెట్ చేస్తూ పోతున్నారు.
దేశానికి ఇంతకు మించిన సమస్యలు లేవా ?
జ్ఞానవాపిలో శివలింగం బయటపడిందన్న ప్రచారం తర్వాత .. ఇక ధరల పెరుగుదల లాంటి అంశాలపై చర్చే ఉండదని ప్రజలు కూడా గట్టిగా నమ్మారు. అంతే జరుగుతోంది. పెరుగుతున్న ధరలు, కుదించుకుపోతున్న ఉపాధి అవకాశాలతో దేశ ప్రజలు సంక్షోభం ముంగిట ఉన్నారన్న సంగతి అందరూ మర్చిపోతున్నారు. ప్రజల నమ్మకాలతో, మనోభావాలతో చెలగాటమాడటం, వారి నెత్తుటి ధారలతో అధికారానికి బాటలు వేసుకోవడం రాజకీయం అయిపోయింది. కానీ దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపైఎవరూ సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదు. క్షీణిస్తున్న రూపాయి విలువతో ఈ ఏడాది ఆసియాలోకెల్లా బాగా దెబ్బతిన్న కరెన్సీ ఇప్పుడు మనదే . స్టాక్‌మార్కెట్ కష్టాలు సరేసరి. చివరికి హాట్ ఫేవరేట్ అయిన ఎల్ఐసీ షేర్లు కూడా దిగువ చూపులు చూస్తున్నాయి. అలా భారత్ ఇప్పుడు ఆర్థిక, వాణిజ్య లోటులు రెండూ ఆందోళన కలిగిస్తున్నాయి. ధరలు ఇలానే పెరుగుతూ పోతే, వృద్ధిపై గట్టి దెబ్బ పడుతుంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా కాపు కాయకపోతే కష్టమే. వృద్ధి స్తంభించి, ద్రవ్యోల్బణం పెరిగిపోయే విచిత్రమైన ‘స్టాగ్ఫ్లేషన్’ భయాలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ మసీదులు.. శివలింగాల గురించి చర్చలు జరుపుతున్నారు.
దేశాన్ని సంరక్షించాల్సింది ప్రజలు.. పాలకులే !
దేశమంటే ప్రజలు… మట్టి కాదు. ఈ ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు మనం.. తర్వాత మన వారసులు.. ఆ తర్వాత వారి వారసులు. ఎరవైనా కానీ జీవించాలి. అలా ప్రస్తుత స్వార్థం కోసం భవిష్యత్ తరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టకూడదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది. అలా చేస్తోంది.. చేయకూడని పాలకులే . తమ స్వార్థం కోసం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న రాజకీయంతో దేశానికే ముప్పు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికి బాగానే ఉండవచ్చుకానీ.. రేపు పరిస్థితి తిరుగబడవచ్చు. చరిత్రలో అనేక దేశాలు ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నాయి. అందుకే వీలైనంత త్వరగా ప్రజలు మేలుకోవాలి.. పాలకుల్ని మేల్కొలపాలి. లేకపోతే… తీరిగ్గా బాధపడటానికి కూడా మనకు అర్హత ఉండదు.