తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అభ్యర్థుల్ని కూడా ఖరారు చేస్తున్నారు. రాయలసీమ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. తాను పర్యటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో కూడా చెబుతున్నారు. బహిరంగ ప్రకటన చేస్తున్నారు. వారు గట్టిగా పని చేసుకోవాలని నేరుగానే చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తున్నారు. అక్కడ ఆయా నేతల ప్రలోభాలకు లొంగని వారిని ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. వారికే పోటీకి చాన్స్ అని.. పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డికి తిరుగు ఉండదు. గతంలో మహిళా అభ్యర్థిని పెట్టారు. కానీ ఆమె పెద్దిరెడ్డి రాజకీయాలకు నిలబడలేకపోయారు. దీంతో చల్లా బాబు అనే నేతకు చంద్రబాబు చాన్సిచ్చారు. ఆయన ఇంచార్జి పదవి తీసుకున్నప్పటి నుండి మరో పని పెట్టుకోకుండా టీడీపీ కోసం తిరుగుతూనే ఉన్నారు. దాడులను అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడమే కాదు.. వైసీపీకి ఎదురెళ్లి సవాల్ చేస్తున్నారు. పరిస్థితిలో మార్పు కనిపించడంతో… చంద్రబాబు చల్లాబాబే పోటీ చేస్తున్నారని.. పెద్దిరెడ్డిని ఓడించబోతున్నారని ప్రకటించేశారు. దీంతో చల్లా బాబు వర్గీయులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్‌లోనూ అంతే. డోన్‌లో బుగ్గనకు వ్యతిరేకంగా గతంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులు పని చేసేవారు . వారి సరితూగకపోవడంతో సుబ్బారెడ్డి అనే నేతకు ఇంచార్జి పదవి ఇచ్చారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకు వచ్చారు. ఆ తర్వాత కూడా చురుకుగా పని చేస్తున్నారు. డోన్‌లో గట్టిగా నిలబడే నేత ఉండే బుగ్గన ఓడిపోవడం ఖాయమన్న అంచనాలు రావడంతో సుబ్బారెడ్డికే చంద్రబాబు టిక్కెట్ ప్రకటించారు.
ఇలా కొంత మందికి బహిరంగంగా టిక్కెట్లు ప్రకటిస్తున్న చంద్రబాబు.. అంతర్గత సమావేశాల్లో నియోజకవర్గాల్లో పోటీ లేని వారికి పని చేసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాలపై చంద్రబాబు ఓ అవగాహనకు వచ్చారని… ఈ సారి టిక్కెట్ల కేటాయింపులో… ఆలస్యం ఉండదని.. ముందస్తు ప్రకటన వచ్చిన మరుక్షణం అభ్యర్థుల్ని ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.