ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన ఆరు వందల మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున దాదాపుగా రూ. పద్దెనిమిది కోట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ నష్టపరిహారంగా అందించనున్నారు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి.. రైతుల కుటుంబాలను పరామర్శించి కేసీఆర్ ఈ సాయం అందిస్తారు. అయితే ఈ సాయంపై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ఎంతో మంది రైతులు తంటాలు పడుతున్నారని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని కానీ వారినెవర్నీ కేసీఆర్ పట్టించుకోకుండా… పంజాబ్ లో చనిపోయిన రైతుల్ని ఆదుకుంటామని బయలుదేరారన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. సామాన్య జనంలోనూ ఇదే అంశం చర్చకు వస్తోంది. తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ము… ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారంగా ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది వారి ప్రశ్న. నిజానికి పరిహారం ఇవ్వాలనుకుంటే పంజాబ్ ఇవ్వొచ్చు.
అక్కడ ఆప్ ప్రభుత్వం ఉంది . లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇవ్వొచ్చు… ఎందుకంటే ఉద్యమం ఢిల్లీలో జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధమన్న వాదన వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ముతో రాజకీయం చేస్తున్నారని.. అక్కడ మైలేజీ కోసం ప్రజా ధనం వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష పార్టీలు అదే విమర్శలు చేస్తున్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ.. ముందుగా సొంత రాష్ట్ర రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.