ఏ సినిమాకెళ్లినా… ముఖేష్ యాడ్ ని భరించాల్సిందే. హాయిగా సినిమా చూద్దామని వస్తే.. ఈ గోలేంట్రా అని తలలు పట్టుకుంటుంటారు ప్రేక్షకులు. కాకపోతే.. ధూమపానం, మద్యపానం గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తో జోడించిన ప్రకటన అది. సినిమాల్లో సిగరెట్ తాగడం చాలా కామన్‌గా కనిపిస్తుంది. కాబట్టి.. ప్రేక్షకుల్ని ఆ రూపంలో మేల్కొలపాల్సిందే. అయితే.. `ఎఫ్ 3`లో ఈ గోల లేదు. ఇందులో ముఖేష్ యాడ్ కనిపించదు. ఎందుకంటే.. ఈ సినిమాని వీలైనంత క్లీన్ గా చూపించాలన్న ఉద్దేశంతో సిగరెట్టు, మద్యం.. ఇలాంటి సన్నివేశాల్ని ఈ సినిమాలో చూపించలేదు. అందుకే సెన్సార్ కూడా క్లీన్ `యూ` సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలని దిల్ రాజు కంకణం కట్టుకొని తీసిన సినిమా ఇది. అందుకే `ఈ సినిమాలో ఎవరూ సిగరెట్ తాగకూడదు. మద్యం ముట్టకూడదు` అని దిల్ రాజు స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశార్ట. అందుకే ఒక్క సన్నివేశంలో కూడా అవేం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసే సినిమాలన్నీ… ఈ నిబంధన పాటిస్తే బాగుంటుందేమో..?
రన్ టైమ్ కూడా చాలా షార్ప్ గా కట్ చేశారు. 2 గంటల 20 నిమిషాలంటే.. పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పాలి. ఎఫ్ 2లో పూర్తిగా ఫన్ మీదే దృష్టి పెట్టాడు రావిపూడి. అయితే సారి ఫన్ డోస్ పెంచుతూనే, ఎమోషన్పైనా గురి పెట్టాడట. ద్వితీయార్థంలో కొన్ని ఎమోషన్ సీన్లు బాగా డిజైన్ చేశాడని, అవన్నీ కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది.