వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూండటం వివాదాస్పదమవుతోంది. అసలేమీ జరగకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పోలీసులు ఇక్కడ స్వయంగా హత్య జరిగినట్లుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నా ఇంకా అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ చెబుతున్నది పూర్తి స్థాయిలో అబద్దమనడానికి ఆధారాలు లభించాయి. సుబ్రహ్మణ్యం అనే యువకుడికి కాకినాడలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారు.కానీ ఆయన చెప్పిన చోట ప్రమాదమే జరగలేదని పోలీసులే తేల్చారు. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ఎలాంటి ప్రమాద దృశ్యాలు నమోదు కాలేదు.
అదే సమయంలో ప్రమాదం జరిగితే ప్రైవేటు ఆస్పత్రికి తరలించామన్నారు. కానీ అలాంటి యాక్సిడెంట్ కేసు తమ వద్దకు రాలేదని ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అలాంటి కేసు వస్తే.. చనిపోయాడని నిర్ధారిస్తే.. మెడికో లీగల్ కేసు అవుతుంది. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాలి. కనీసం అంబులెన్స్‌లో అయినా తరలించారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ సొంత కారులో బ్యాక్ సీటులో మృతదేహాన్ని తీసుకుని వచ్చారు. ఆయన తాను రాలేదని చెబుతున్నారు. కానీ ఆయన వచ్చినట్లుగా సీసీ కెమెరా దృశ్యాలు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ అన్నీ అబద్దాలే చెబుతున్నారు. అంటే.. ప్రాథమికంగా ఆయనపైనే అనుమానం రావాలి.
కానీ పోలీసులు ఆయనపై ఇంత వరకూ ఎలాంటి కేసూ నమోదుచేయలేదు. ఓ మనిషిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ పై కేసు నమోదుకు పోలీసులు తటపటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. మరో వైపు ఎమ్మెల్సీ మీడియా ముందుకు వస్తానని ప్రకటించి .. తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతా సెటిల్ చేసుకుని ఆయన తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ కేసు పోలీసుల తీరుపై మళ్లీ మళ్లీ సందేహాలు రెకేత్తించేలా చేస్తోంది.