జగన్ లండన్ వెళ్లారని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందో ఆయన విపులంగా చెప్పారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. కానీ అక్కడ ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. అందువల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. అంతే కాదు అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
అక్కడ్నుంచి బయలుదేరి జ్యూరిచ్‌లో ల్యాండ్ అవ్వాలంటే ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందట. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారట. రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ల్యాండింగ్ ను నిషేధించారని బుగ్గన చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి లండన్‌లోనే బస ఏర్పాట్లు చేశారట.
అయితే ల్యాండింగ్‌కు అనుమతి వచ్చినప్పటికి.. ఎందుకు బయలుదేరలేదంటే.. దానికీ బుగ్గన ఓ కారణం చెప్పారు. తెల్లవారుజామునే జ్యూరిచ్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బయలుదేరలేదట.
అసలు జ్యూరిచ్ వెళ్లడానికి లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత లండన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని … ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బుగ్గన ఇది మాత్రం చెప్పడంలేదు. బుగ్గన చెప్పిన కథలు.. పూర్తిగా కియా పరిశ్రమను వైఎస్ఆర్ తీసుకొచ్చారని సృష్టించినలేఖలా ఉండటంతో సోషల్ మీడియాలో … మొత్తానికి ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు.