ఏపీ పీసీసీ చీఫ్ పదవి తీసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకత చూపడంతో హైకమాండ్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీతో ముప్పావు గంట సేపు భేటీ అయినప్పటికీ ఆయనను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమిస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బాధ్యతలు తీసుకునేందుకు కిరణ్ అంగీకరించలేదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో ఆ స్థానాన్ని సాకే శైలజానాథ్‌కు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కిరణ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడానికి ప్రయత్నాలను హైకమాండ్ చేసింది. కానీ కిరణ్ అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే… తన నియామకం టీడీపీ సిఫార్సుతో జరిగిందన్న ప్రచారం చేస్తారని దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని కిరణ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు.
ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన సోదరుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలంటే ఇప్పుడు ఉన్న నేతల్లో ఆయనే సరైన వారని భావిస్తున్నారు. అందుకే ఇంచార్జి ఊమెన్ చాందీ, మొయ్యప్పన్ వంటి వారు కిరణ్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.