జై శ్రీరాం అనేది బీజేపీ కార్యకర్తల నినాదం. అది దేవుడి నినాదం అయినా రాజకీయ ప్రత్యర్థులు కనబడినప్పుడల్లా ఆ నినాదాలు చేసి.. రెచ్చగొడుతూ ఉంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకూ ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్లో ఆమె ప్రత్యర్తి బీజేపీనేతే. దీనికి విరుగుడుగా కవిత మరో స్లోగన్ కనిపెట్టారు. దాన్ని కార్యకర్తలకూ వివరించారు. బీజేపీ నేతలు తమను రెచ్చగొట్టేందుకు జైశ్రీరాం అని నినాదాలు ఇస్తున్నారని వారు అలా అంటే మనం మనం జై హనుమాన్ అనాలని ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కవిత కొండగట్టు హనుమాన్ ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు. కోరుట్ల సమావేశానికి వెళ్లే ముందు కూడా కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. బీజేపీ మార్క్ హిందూత్వ వాదనకు… హనుమాన్ అస్త్రంతో చెక్ పెట్టాలని కవిత ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీపాలనలో ప్రజలుఎవరూ సంతోషంగా ఉండటం లేదని పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఇచ్చి మోసం చేశారని..కానీ ఇప్పుడు దేవుడి పేరుతో మోసం చేయడానికి వస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు.