రైతు భరోసా కింద రూ. పన్నెండున్నర వేలు ఇస్తానని చివరికి ఏడున్నరవేలు ఇస్తూ… మిగతావి మోడీ ఇస్తున్నారని లెక్క చెబుతున్న జగన్ సర్కార్ తాజాగా అమ్మఒడి పథకానికి కూడా అలాంటి లిటిగేషన్లే పెడుతోంది. స్కూలుకు పంపితే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ. పదిహేను వేలు ఇస్తామని చెప్పి చివరికి ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్క తల్లికే ఇస్తామని కవర్ చేశారు. అందులోనూ రూ. వెయ్యి తగ్గించి ఇస్తున్నారు. రూ. పధ్నాలుగువేలే ఇస్తూ వస్తున్నారు. మరో రూ. వెయ్యి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణకు అని చెప్పుకున్నారు. ఆ మరుగుదొడ్ల నిర్వహణకు రూ. వెయ్యి సరిపోవడం లేదేమో కానీ.. మరో వెయ్యి తగ్గించాలని నిర్ణయించారు.
అసలు అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదుకు.. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు. అసలు పిల్లలు ఎందుకివ్వాలి.. అది ప్రభుత్వం బాధ్యత. పథకం అమలు చేస్తున్నప్పుడు మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు పిల్లలదే అని చెప్పలేదు. కానీ కట్ చేసుకుంటున్నారు. నిధులు సర్దుబాటు చేసుకోలేక ఇలా వేలకు వేలు పథకంలో కత్తిరింపులు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి లబ్దిదారుల సంఖ్య కూడా భారీగా తగ్గించారన్న ప్రచారం జరుగుతోంది.
మామూలుగా జనవరిలో ఇవ్వాల్సినవి.. జూన్‌కు మార్చారు. జూన్‌లో అటెండెన్స్ లింక్ పెట్టారు. ఇప్పుడు రూ. వెయ్యి తగ్గించారు. మొత్తానికి పథకం అమలు చేసేసరికి.. రౌండ్ ఫిగర్ పదివేలు ఇస్తామంటారేమో కానీ.. ఇలా వేలకు వేలు రాలిపోవడం మాత్రం ప్రజల్ని నిరాశకు గురి చేస్తోంది. ఈ పథకాల పేర్లు చెప్పి మద్యం ధరలు పెంచి ఇష్టారీతిన మధ్య తరగతి కుటుంబాల్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పథకం నిధులు కూడా తగ్గించేస్తున్నారు.