తెలంగాణ నుంచి ఓ నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తాజాగా షెడ్యూల్ వచ్చిన ఎన్నికల్లో యూపీ నుంచి ఓ రాజ్యసభ స్థానానికి తెలంగాణ నేతకు చాన్సిస్తే వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్థికంగా ఉపయోగపడేవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన చినజీయర్ ద్వారా వైసీపీ చాన్స్ కోసం ప్రయత్నించారు. కానీ కేసీఆర్‌తో చినజీయర్‌కు సంబంధాలు చెడిపోవడం.. రామేశ్వరరావు కూడా దూరమైనట్లుగా తేలడంతో జగన్ కూడా కాస్త దూరం పాటిస్తున్నారు. ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
ఇప్పుడు ఆయన దృష్టిలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కాకపోతే.. బీజేపీ నుంచి ఇంకెవరికి చాన్స్ వస్తుందా అన్నచర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ బీజేపీలో చేరడమే కాదు.. టీడీపీలో మిగిలిన ఉన్న క్యాడర్ ను బీజేపీలో చేర్పించిన గరికపాటి నరసింహారావుకు బీజేపీ హైకమాండ్ మళ్లీ రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు గతంలో రాజ్యసభ సీట్ల భర్తీ సమయలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ అప్పుడు సమీకరణాలు కుదరలేదు. ఈ సారి కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
ఆయన కాకపోతే నల్లు ఇంద్రసేనారెడ్డి, బీసీ విభాగానికి చీఫ్‌గా ఉన్న లక్ష్మణ్ వంటి పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉంది. దక్షిణాదిలో బలపడాలంటే ఉత్తరాది నుంచి వారికి కొన్ని అవకాశాలు కల్పించాలని బీజేపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికే జీవీఎల్ నరసింహారావుకు.. యూపీ నుంచే చాన్సిచ్చారు. ఇప్పుడు మరోసారి యూపీ నుంచికానీ మరో రాష్ట్రం నుంచి తెలంగాణ వారికి చాన్సిస్తే… బీజేపీ నేతల పంట పండినట్లే అవుతుంది.