ఎప్పటికప్పుడు కేంద్రం కాస్తంతయినా పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గిస్తోంది కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలపై కనీస కనికరం చూపించడం లేదు. తాము పెంచలేదు కాబట్టి తాము తగ్గించే ప్రశ్నే లేదని వాదిస్తూ వస్తున్నాయి. ఇంకా చాన్స్ ఉంటే రోడ్ సెస్ లు లాంటివి వేసుకుని అదనపు బాదుడు కార్యక్రమాన్ని చేపడుతున్నాయి కానీ.. తగ్గించాలన్న ఆలోచన చేయడం లేదు. అయితే పెట్రోల్, డీజిల్ ధర గరిష్ట స్థాయికి చేరి.. కేంద్రం, రాష్ట్రాలు ఎన్నెన్ని పన్నులు వసూలు చేస్తున్నాయన్నదానిపై స్పష్టమన లెక్కలు ప్రజలకు తెలుస్తూండటంతో ఇప్పుడు రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది.
కేంద్రంతో పాటుగా కాకపోయినా ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువ వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఏపీలో ఉంది. తెలంగాణలో తక్కువేమీ కాదు. కర్ణాటకతో పోలిస్తే.. ఏపీలో పెట్రోల్ ధర దాదాపుగా రూ. పది ఎక్కువ. తమిళనాడుతోనూ దాదాపుగా అంతే. అందుకే శివారులో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అంతర్రాష్ట్ర రహదారుల్లో వెళ్లే వాహనాలు పొరుగు రాష్ట్రాల్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాష్ట్రం దాటిన తర్వాతనే మళ్లీ ఆయిల్ కొట్టించుకుంటున్నారు. ఇక సామాన్యుల సంగతి చెప్పాల్సిన పని లేదు.
కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందన్న ఆశతో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రాజకీయ ఖర్చుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆదాయం కూడా తగ్గిపోయింది. అప్పుల మీద ఆధారపడి ఉన్నారు. ఉన్న ఆదాయంమే సరిపోని పరిస్థితి. ఇంకా తగ్గించుకునే అవకాశం లేదు. అందుకే… ప్రజల ఆశలే కానీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించే అవకాశమే లేదని.. చెబుతున్నారు.