వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి హత్యేనని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. మెడికల్ రిపోర్టులో ఆయనను కొట్టి చంపినట్లుగా తేలిందని దాంతో హత్య కేసుగా నిర్దారించి… ఏ వన్‌గా అనంతబాబును చేర్చి హత్య కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సుబ్రహ్మణ్యం విషయంలో ఎవరికైనా అది హత్యేనని ప్రాథమికంగా అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం హతుని భార్య.. ఇతర విపక్షాలు రెండు, మూడు రోజుల పాటు అట్టుడికేలా ఆందోళనలు చేస్తే తప్ప.. అనుమానాస్పద కేసును హత్యగా మార్చేందుకు పోలీసులు సిద్ధం కాలేకపోయారు.
ఇలాంటి ఘటన జరిగితే ముందుగా ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోవాలి. కానీ ఆయన మాత్రం దర్జాగా పెళ్లిళ్లకు… తిరుగుతూనే ఉన్నారు. తీరా పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చే సరికి ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారనిప ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నామని చెప్పుకొస్తున్నారు. ప్రమాదం జరిగిందని.. మరొకటని ఎమ్మెల్సీ అబద్దాలు చెప్పడమే కాకుండా .. నోరు తెరవ వద్దని కుటుంబసభ్యుల్ని బెదిరిస్తున్నప్పటికీ… ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేదని ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారని విపక్షాలు మండి పడుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టే చట్టం ఆయనకు చుట్టంలా మార్చేశారన్న ఆరోపణలు పోలీసులపై తీవ్రంగా వస్తున్నాయి. చివరికి నిందితుడ్ని అరెస్ట్ చేసే విషయంలోనూ అదే పరిస్థితి. చనిపోయిన సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. ఆర్థిక సాయం అందిస్తామని ప్రజాప్రతినిధులు హమీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది . హత్య కేసుగా నమోదు చేయక తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. చర్చలు ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.