హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. గాయపడినవారికి సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మృతుల ఆత్మశాంతిని ఆశిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా…దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో విరమించుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలకు తోడ్పాటు అందించవలసిందిగా జనసేన కార్యకర్తలకు పవన్ విజ్ఞప్తి చేశారు.