చరిత్ర అంటే ఔరంగజేబులు.. మొఘలుల రాజ్యాలు.. దండయాత్రలు.. మసీదులు..గుళ్లను మార్చడమే కాదు.. కావాలంటే సాయుధ పోరాట చరిత్రలు కూడా మార్చేస్తామని బీజేపీ మరోసారి నిరూపించింది. ఏ మత్రం మొహమాటపడకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలో అల్లూరి సీతారామరాజును తెలంగాణ సాయుధ పోరాట యోధుడ్ని చేసేసింది. ఎవరో ఆషామాషీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే… పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ నేరుగా అమిత్ షానే చెప్పారు. అంతే కాదు.. అమర వీరుల జాబితాలో అల్లూరి ఫోటోను కూడా పెట్టారు. ఢిల్లీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఈ విశేషం జరిగింది.
అమిత్ షా అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారని ప్రకటించేశారు. అమిత్ షా స్పీచ్ ఎవరు రాశారో కానీ.. ఆర్ ఆర్ఆర్ సినిమా ప్రభావం ఆయనపై బాగా ఉన్నట్లుందని అర్థమైపోయింది. నిజానికి ఎక్కడా అల్లూరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. ఎలాంటి చరిత్ర లేదు. ఇది తెలంగాణ చరిత్రను, అల్లూరి వీరత్వాన్ని రెండింటినీ కించపర్చడమేనని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ గురించి బీజేపీ నేతలకు అసలు ఏమీ తెలియదని ఈ వీడియో క్లిప్ పట్టుకుని టీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. వారికి బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా కల్పితం అని చెప్పినా.. అల్లూరి ఎప్పుడూ కొమురంభీంను కలవలేదని .. తాము ఫిక్షన్ గా కథ చెప్పామని చెప్పినా చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అదే కథను బీజేపీ కూడా చెప్పడం ప్రారంభించింది. దీంతో బీజేపీ మార్క్ చరిత్ర .. వాట్సాప్ యూనివర్శిటీ ప్రభావం అంటూ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.