రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నామని .. ఇందులో రకరకాల సేవలు ఉంటాయని.. విత్తనాలు.. పురుగుమందులు అమ్ముతామని.. దేశమంతా తమ వైపు చూస్తోందని ఏపీ ప్రభుత్వం ఎన్ని సార్లు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల పేర్లను మార్చాలని నిర్ణయించారు. అంత ప్రచారం చేసి ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తున్నారంటే… అవి కట్టింది రాష్ట్రమే కానీ కట్టించింది కేంద్రం. ఇప్పుడు కేంద్రమే వాటికి ఏ పేర్లు పెట్టాలో ఆదేశించింది.
రైతు భరోసా కేంద్రాల పేర్లను రైతు ఉత్పత్తి నిల్వ కేంద్రాలుగా మార్చాలని కేంద్రం ఆదేశించింది. మార్చకపోతే మార్చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉంటే.. ప్రభుత్వం తామే రూ. లక్షలు పెట్టి కట్టిస్తున్నామని చెబుతున్న ఆర్బీకేల భవనాలు పూర్తిగా కేంద్రం సొమ్ము. 90 శాతం నిధులు కేంద్రం సమకూరుస్తుంది. పది శాతం మాత్రమే రాష్ట్రం భరించాలి. ఒక్కో భవనం విలువ రూ. 21 లక్షలు. అన్నీ వైసీపీ నేతలకు కాంట్రాక్టులకు ఇచ్చేవారు. వారే ఎలా నిర్మించాలో అలా నిర్మిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేయడంతో ఈ భవనాలు నిర్మాణమయ్యాయి.
అయితే ఆర్బీకేలను తామే కడుతున్నామని ప్రభుత్వం కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. పేర్లు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయాలను కూడా ఉపాధి హామీతో లింక్ చేసి మరీ నిర్మిస్తున్నారు. అంటే వాటిలోనూ 90 శాతం కేంద్ర నిధులు ఉంటాయన్నమాట. బీజేపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పనుల్లో 90 శాతం కేంద్ర నిధులేనని చెబుతూఉంటారు. కానీ నమ్మేలా చెప్పరు. అది వారి విధానమో.. చేతకాని తనమో తెలియదు కానీ.. తప్పనిసరిగా ఏపీలో జరుగుతున్న కొద్ది నిర్మాణాలు.. కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని తేట తెల్లమవుతోంది.