ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ కీలకం. ఎంత బలమైన వర్గం అండ ఉంటే…పార్టీ అంత బలంగా ఉంటుంది. ఓ సామాజికవర్గం ఏకపక్ష మద్దతు ఇస్తేనే సాధ్యం అవుతుంది. అన్ని రాజకీయపార్టీలకు అదే ప్లస్ పాయింట్. బీజేపీకి తెలంగాణ ఇప్పటి వరకూ అలాంటి ప్లస్ పాయింట్ లేదు. ఇప్పుడు మున్నూరు కాపుల్ని అలా ఓటు బ్యాంక్‌గా చేసుకుని.., బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఆ బలమైన వర్గాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉంది. వరుసగా ఆ సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు రాజ్యసభకు అవకాశం కల్పించి బీజేపీ తన ఉద్దేశం పక్కాగా స్పష్టం చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మున్నూరుకాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ వర్గం టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉందని భావిస్తున్న బీజేపీ.. దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయ పార్టల జయాపజయాలు నిర్ణయిస్తారు. ఇప్పటికే మున్నూరు కాపులకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీని అన్నీ తామైనడిపిస్తున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆ వర్గం వారే.
లోక్ సభ ఎన్నికలప్పటీ నుంచి మున్నూరు కాపు ఓట్లు బీజీపీవైపు ఉన్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గెలవటం.. దుబ్బాక, హుజూరాబాద్ లో మున్నూరుకాపు ఓట్లు బీజీపీకి పోలరైజ్ కావటంతో ఈఓటు బ్యాంక్ పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన కేసీఆర్ అదే సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ అది రెండేళ్లే. దీనిపైనా బీజేపీ వ్యూహాత్మక ప్రచారం చేస్తోంది. రెడ్డి, వెలమ వర్గాలకు ఆరేళ్ల కాలం ఇచ్చి బీసీలకు రెండేళ్ల పదవి ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ వచ్చినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.