దృశ్యం సినిమాను ఫాలో అవుతున్నారు వైసీపీ పెద్దలు. అమలాపురంలో అంత విధ్వంసం జరిగి.. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని తగలబెడితే కనీసం పట్టించుకోవడం లేదు. అమలాపురంలో ఇంటర్నెట్ ఆపేసి.. అక్కడి సమాచారం పెద్దగా బయటకు రాకుండా చేసేసి అంతా కామ్‌గా ఉండిపోతున్నారు. అక్కడేమీ జరగలేదు… ఏమీ చేయలేదు.. ఏమీ జరగనట్లే ఉండండి అన్నట్లుగాఉండిపోతున్నారు. నిందితుల్ని… ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు కానీసం బాధితుల్ని కూడా ఎవరూ పరామర్శించడం లేదు.
దళిత మంత్రి ఇంటిని తగలబెడితే ఆయనను పలకరించేవారు లేరు. ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేస్తే ఆయనను పట్టించుకున్న వారు లేరు. సాధారణం ఓ మంత్రి కారుపై చిన్న రాయి పడినా .. ఆయనకు జరిగే పరామర్శలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడేందో విచిత్రంగా విశ్వరూప్ ఇంటిని తగలబెట్టినా సొంత పార్టీ నేతలు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. కనీస ఓదార్పు లేదు. తన టీంలోని మెంబర్‌పై దాడి జరిగితే… జగన్ కనీసం కన్సర్న్ కూడా చేయలేదు. దాడి జరిగినప్పుడు విదేశాల్లో ఉన్నారు. అప్పుడు పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందన్న వివరాలుతెలుసుకుని ఓదార్పు ఇవ్వలేదు.
పోలీసుల వ్యవహారం కూడా అంతే ఉంది. పాలరాజు అనే అధికారికి మొత్తం అప్పగించి డీజీపీ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. గొడవలు జరిగిన తర్వాత రోజు ప్రశాంతంగా తిరుమల దర్శనం చేసుకుని అక్కడ మీడియా ఎదురు పడితే మాట్లాడటం తప్ప.. తర్వాత ఏం జరిగిందన్నది కూడా చెప్పడం లేదు. ఆయన అమలాపురంలో పర్యటించలేదు. మంత్రిపై దాడి జరిగితే.. డీజీపీ పట్టించుకోకపోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. కొత్త డీజీపీ తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఏ ఒక్కర్నీ కలవడం లేదు. వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. శాంతిభద్రతలపై మాట్లాడుతున్నదీ తక్కువే.
అమలాపురం వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ నేతలే అన్న విషయాలు అందరికీ అర్థమయ్యాయి. అందుకే .. అక్కడ ఏమీ జరగలేదన్న భావనతో ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.