రాజధాని విషయంలో ఇప్పటికైనా కోర్టు తీర్పు అమలు చేయాలని జగన్కు సలహాలు వస్తూనేఉన్నాయి. అయితే ఈ సారి ఆయనకు సలహాలు ఇచ్చింది ఏపీ పార్టీలు.. లేకపోతే.. ప్రజా సంఘాలు కాదు. తెలంగాణ మేధావులు. అమరావతి రైతుల ఉద్యమం 900 రోజులు పూర్తయిన సందర్భంగా .., తెలంగాణ నుంచి కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావులు రైతులను పరామర్సించారు. సంఘిభావం తెలిపారు.
విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని హోటల్ గేట్ వే లో అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు పేరిట మేధావుల చర్చా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రముఖులు హాజరై రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులో పోరాటం కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ నేత నారాయణ తేల్చి చెప్పారు.
ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు స్పష్టం చేసారు. రైతుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయం కోసం ఉద్యమాలతో ముందుకెళ్లాల్సిందేనని, ప్రజా ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని… సీపీఐ నేత నారాయణ .. జగన్ను ప్రశ్నించారు. ఏపీ మేధావుల మాటలను వినరు కానీ.. తెలంగాణ మేధావుల మాటలనైనా జగన్ వింటారేమో చూడాలి.