వైసీపీ ఇటీవల బస్సు యాత్ర నిర్వహించింది. ఆ బస్సు యాత్ర నర్సరావుపేటలో బహిరంగసభ నిర్వహించింది. అక్కడ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఎవరికీ కనిపించలేదు. అక్కడొక్కచోటే కాదు. ఏ పార్టీ కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు కూడా. ఆయనను తీవ్రంగా విభేదించే విడదల రజనీ ఇప్పుడు వైసీపీలో పవర్ ఫుల్ రోల్లో ఉన్నారు. పార్టీలో ఆమె ఎవరినైనా పక్కన పెట్టేయించగల స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె కూడా ఎంపీని పక్కన పెట్టేసేలా చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు నర్సరావుపేట నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యేతోనూ ఎంపీ లావుకు సన్నిహిత సంబంధాలు లేవు. చివరికి వినుకొండ ఎమ్మెల్యేతోనూ విభేదాలొచ్చాయి. అంబటి రాంబాబు వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విడదల రజనీతో ఆయనకు ఉన్న విభేదాలు తెలుసు కాబట్టి.. ఆయనతో స్నేహం ఉందని తెలిస్తే.. తమ సీట్ల కిందకు ఎక్కడ తెస్తారోనని చాలా మంది దూరంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ ఎంపీకి ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ సారి ఎంపీ సీటు కూడా ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితి.
విజ్ఞాన విద్యా సంస్థల వారసుడిగా తెరపైకి వచ్చిన లావు కృష్ణదేవరాయులుకు మొదటి నుంచి పార్టీలో ప్రాధాన్యం లేదు. సోషల్ మీడియోలో ప్రమోషన్ కోసమే ఎంపీ పదవి అన్నట్లుగా ఉండే మార్గాని భరత్‌కు ప్రాధాన్యం ఇచ్చారు కానీ లావుకు ఇవ్వలేదు. అదే సమయంలో నియోజకవర్గంలో నిలువ నీడ లేకుండా చేశారు. దీంతో ఆయన హర్ట్ అయ్యారని.. అంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండే లావు.. తదుపరి ఏం చేస్తారన్నది వైసీపీ వర్గాల్లోనే ఉత్కంఠగా మారింది.