యూపీలోని బీజేపీలో అల్లర్లు జరుగుతున్నాయి. దానికి కారణం ఇద్దరు బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేనని వారిద్దర్నీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సస్పెండ్ చేశారు. ఏ మతాన్ని కించ పరిచినా.. తమ నేతల్ని ఊరుకోబోమని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. వెంటనే కేటీఆర్ ఆయనకు రిప్లై ఇచ్చారు. వారిద్దరి కంటే దారుణంగా బండి సంజయ్ మాట్లాడారని.. ఆయన్నేం చేస్తారని ఈ ట్వీట్లో ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ నేతలు హిందూయేతర వర్గాలు.. వారు బాగా ఆరాధించే వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామనే. అలాంటి వారిపై చర్యలు తీసుకునే సంప్రదాయం బీజేపీలో లేదు. గతంలో మహాత్ముడ్నే దారుణంగా అవమానించి.. వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు యూపీలోని కాన్పూర్‌లో అల్లర్లకు కారణంగా మారిన ఇద్దరు బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అంతే కాదు.. అందరూ ఇదే విషయాన్ని చూపిస్తే.. మీ వాళ్లు అంత కన్నా ఎక్కువ మాట్లాడారు.. వాళ్ల సంగతేంటి అని ప్రశ్నించడం ప్రారంభించారు. కేటీఆర్ ట్వీట్ ఈ కోవలోకే వస్తుంది.
బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందా?, అదే నిజమైతే అన్ని మసీదులను తవ్వి ఉర్దూపై నిషేధం విధించాలన్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోగలరా?, ఎందుకు ఈ ఎంపిక చికిత్స నడ్డా జీ.. ఏదైనా క్లారిటీ ఉందా? అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రమే కాదు.. గతంలో ఇతర వర్గాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల స్టేట్మెంట్లను నెటిజన్లు ప్రదర్శిస్తూ వారినేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేనిది .. ఇతర వర్గాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని బీజేపీ సస్పెండ్ చేయడం ఓ వింత అయితే.. ఆ తరహాలోనే ఇతర నేతల్ని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్స్ రావడం… బీజేపీ నేతలకు ఇబ్బందికరం అవుతోంది.