రాజకీయాలపై చాలా కాలంగా బహిరంగ కామెంట్లు చేయని వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు హఠాత్తుగా పవన్ కల్యాణ్ పై రియాక్టయ్యారు. పవన్ పొత్తుల విషయంలో ప్రకటించిన మూడు ఆప్షన్లపై సెటైర్లు వేశారు. పవన్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదన్నారు. ఏపీకి పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్.. నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నారన్నారు. మళ్లీ వామపక్షాలతో కూడా కలుస్తారేమోనన్నారు. పవన్‌ని విమర్శించేంత స్థాయి, మెచ్యూరిటీ తనకు లేవని సెటైర్లు వేశారు.
మామూలుగా అయితే కేవీపీ ఏమీ స్పందించకూడదు. కానీ పవన్ వేస్తున్న రాజకీయ అడుగులు ఆయనకూ ఆర్థం కావడం లేదని.. అందుకే మనసులో ఉంచుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. అయితే కేవీపీ ఏదో రాజకీయ ఉద్దేశంతో.. ఏదో సలహా పవన్‌కు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేయాలోనో లేకపోతే.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలోనో ఆయన చెబుతున్నారని..బీజేపీ మాత్రం వద్దని ఆయన ఉద్దేశమని భావిస్తున్నారు.
కేవీపీ తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఏపీ నేతల తో ఎప్పుడైనా ఢిల్లీలో సమావేశాలు జరిగితే ఆయన హాజరవుతున్నారు. ఏపీలో మాత్రం పర్యటించడం లేదు. కానీ తెర వెనుక ఎంతో మంది ఆయనతో టచ్‌లో ఉంటున్నారన్న గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.